Home Telangana మెట్రోకు నిధులు ఇప్పించండి

మెట్రోకు నిధులు ఇప్పించండి

43

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం బహిరంగ లేఖ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. మెట్రో నిధుల విడుదల అంశంపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో తక్షణమే ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం తన లేఖలో డిమాండ్ చేశారు.

నగర విస్తరణకు అనుగుణంగా ఫేజ్-2
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఫేజ్-1 పరిధిలోని మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. నగర జనాభా పెరగడం, చుట్టుపక్కల ప్రాంతాలు విస్తరించడం వల్ల మెట్రో నెట్‌వర్క్‌ను మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అందుకే మొత్తం 7 కారిడార్లు, 122.9 కిలోమీటర్ల కొత్త మార్గం కోసం సుమారు 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఫేజ్-2 ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని వివరించారు.

కేంద్రం అభ్యంతరాలపై అసాధారణ నిర్ణయం
ఫేజ్-1 ప్రైవేటు నిర్వహణలో ఉండటం, ఫేజ్-2ను ప్రభుత్వ భాగస్వామ్యంతో వేరే విధానంలో అమలు చేయడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం చెప్పిన అంశాలను సానుకూలంగా స్వీకరిస్తూ మొత్తం మెట్రో వ్యవస్థ అంతా ఒకే నెట్‌వర్క్ కింద నడవాలనే ఉద్దేశంతో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.

రూ. 15 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు
ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియలో భాగంగా ఈక్విటీ కొనుగోలుకు 1,461.47 కోట్ల రూపాయలు, ప్రాజెక్టు పాత అప్పుల రీఫైనాన్సింగ్ కోసం 13,538.53 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 15,000 కోట్ల రూపాయల లావాదేవీలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని, ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్‌సీఎల్ ఎండీ సుశీల్ కుమార్ కూడా సభ్యుడిగా ఉన్నారని గుర్తుచేశారు.

షరతులు నెరవేర్చినా అందని రుణం
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఆర్‌ఎఫ్‌సీ ఈ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి రుణ మంజూరు ఒప్పందం చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గ్యారంటీ ఇవ్వడంతో పాటు ఆర్‌బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్‌కు కూడా అంగీకరించిందన్నారు. ఐఆర్‌ఎఫ్‌సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 84.32 కోట్ల రూపాయల అప్‌ఫ్రంట్ ఫీజు చెల్లించిందని, ఈక్విటీ నిధులు 1,461.47 కోట్ల రూపాయలను ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసిందని తెలిపారు. అన్ని షరతులు నెరవేర్చినప్పటికీ 2026 జూన్ 15న విడుదల కావలసిన మొదటి విడత రుణం నిలిచిపోవడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దానం అడగటం లేదు
ఈ నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి ఉచిత దానాన్ని ఆశించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలో కచ్చితంగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే తమకు రావలసిన ఐఆర్‌ఎఫ్‌సీ రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, నిధులు త్వరగా వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

సొంత వనరులతోనైనా ముందుకు వెళ్తాం
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలని తాము కోరుతున్నట్లు సీఎం తెలిపారు. ఒకవేళ కేంద్రం నుంచి అనుమతులు ఆలస్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా తన సొంత వనరులు, ఇతర సంస్థాగత రుణాల ద్వారా ఫేజ్-2 పనులను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన ముందస్తు అనుమతులను కేంద్రం నుంచి త్వరగా ఇప్పించాలని కోరారు. రైల్వే మంత్రితో జరిగే సమావేశానికి తానే స్వయంగా అధికారులతో కలిసి హాజరై అన్ని ఆధార పత్రాలతో వివరణలు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు