‘మీపై కేసు ఉంది.. అరెస్ట్ చేస్తాం’ అంటూ ఫోన్ వస్తే భయపడకండి. పోలీసు, సీబీఐ, ఆర్‌బీఐ, కోర్టు అధికారులమంటూ వీడియో కాల్స్‌లో బెదిరించడం ఇప్పుడు సైబర్ మోసగాళ్ల ప్రధాన అస్త్రంగా మారింది. గంటల తరబడి ఆన్‌లైన్‌లో ఉంచి, డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేయడం ‘డిజిటల్ అరెస్ట్’ మోసం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ఫోన్‌లో ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయలేరు. బెదిరింపులకు భయపడి బ్యాంకు వివరాలు, ఓటీపీ, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు చెప్పకండి. స్క్రీన్ షేరింగ్ యాప్‌లు, రిమోట్ యాక్సెస్ లింకులు కూడా క్లిక్ చేయవద్దు. అనుమానం వచ్చిన వెంటనే కాల్ కట్ చేసి అధికారిక మార్గాల్లో వివరాలు నిర్ధారించుకోవాలి. డబ్బు పంపితే ఆలస్యం చేయకుండా బ్యాంకును సంప్రదించి లావాదేవీని నిలిపివేయడానికి ప్రయత్నించాలి. సైబర్ మోసంలో వేగంగా స్పందించడమే డబ్బు తిరిగి పొందే అవకాశాన్ని పెంచుతుంది.
సైబర్ మోసాలపై సుప్రీం నజర్
డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మోసాలను నివారించడం, దర్యాప్తు వేగవంతం చేయడం, బాధితుల ఫిర్యాదులకు పరిష్కారం చూపడం, పోయిన డబ్బును త్వరగా తిరిగి ఇప్పించడం లక్ష్యంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆగస్టు 3న కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సమర్పించిన నాలుగో స్థాయి నివేదికను పరిశీలించిన అనంతరం ఆగస్టు 4న ఈ ఆదేశాలు వెలువడ్డాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సైబర్ మోసాలపై నిరంతర నిఘా అవసరమని స్పష్టం చేసింది. డిజిటల్ అరెస్ట్ మోసాల్లో నమోదైన నష్టం తగ్గినప్పటికీ అప్రమత్తత తగ్గించొద్దని హెచ్చరించింది.
బ్యాంకులపై ప్రత్యేక రక్షణ చర్యలు
ఆర్‌బీఐ నాలుగు వారాల్లో బ్యాంకులకు ఒకే విధమైన ప్రామాణిక విధానాన్ని రూపొందించి అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. సైబర్ మోసాలు, మనీ మ్యూల్ ఖాతాలతో సంబంధం ఉన్న లావాదేవీలు గుర్తించినప్పుడు వాటిని తాత్కాలికంగా నిలిపివేసే విధానం తీసుకురావాలని సూచించింది. ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో ఆలస్య క్రెడిట్, లాగ్డ్ ట్రాన్సాక్షన్ వంటి రక్షణ చర్యలను అమలు చేయాలని పేర్కొంది. కేంద్ర హోంశాఖ రూపొందించిన ఫిర్యాదు పరిష్కారం, నగదు పునరుద్ధరణ విధానాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 69 బ్యాంకులకు చెందిన 1,23,590 శాఖలు ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలో భాగమయ్యాయి. 57 బ్యాంకులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఉన్న నగదు పునరుద్ధరణ వ్యవస్థ ద్వారా 36,290 కేసుల్లో సుమారు రూ.18.05 కోట్లు బాధితులకు తిరిగి అందాయి.
బాధితులకు డబ్బు త్వరగా చేరాలి
రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రాలను నాలుగు వారాల్లో ఏర్పాటు చేసి, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రజల్లో డిజిటల్ అరెస్ట్ మోసాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీల ద్వారా బాధితులకు న్యాయ సహాయం అందించాలని తెలిపింది. తిరిగి పొందిన డబ్బును బాధితులకు ఆలస్యం లేకుండా అందించాలని ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్, వినియోగదారుల ఫోరాలు, కోర్టులు, దర్యాప్తు సంస్థలకు సూచించింది. సీబీఐ కూడా దర్యాప్తులను కొనసాగించాలని, ఒకే ముఠాకు సంబంధించిన అనేక మోసాలను కలిపి చూస్తే కేసు దర్యాప్తు పరిమితిని రూ.10 కోట్ల నుంచి తగ్గించాలా అన్నదానిపై పరిశీలించాలని ఆదేశించింది. డిజిటల్ అరెస్ట్ మోసాలకు ఉపయోగించే కాల్స్‌ను సమయానుసారం నిలిపివేసే ‘కిల్ స్విచ్’ అవకాశాన్ని కూడా పరిశీలించాలని కేంద్ర శాఖలను ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 16న జరగనుంది.
#DigitalArrest #CyberCrime #CyberFraud #SupremeCourt #DigitalScam #OnlineFraud #CyberSecurity #CyberCriminals #RBI #CBI #CyberCrimeAwareness #OnlineScams #BankFraud #DigitalSafety #IndiaNews











