డీలిమిటేషన్ బిల్లుపై చివరి పావులు.
పార్లమెంట్లో డెడ్‌లాక్..
మూడు రోజుల్లో కీలక మలుపు.
ముగింపు దశలో సమావేశాలు .
పార్లమెంట్ సమావేశాలు ముగింపునకు కౌంట్‌డౌన్ మొదలైంది. చేతిలో మిగిలింది మూడు రోజులే. కానీ సభలో మాత్రం డెడ్‌లాక్ తొలగే పరిస్థితి కనిపించడం లేదు. డీలిమిటేషన్ బిల్లు, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు కేంద్రానికి ఇప్పుడు అతిపెద్ద పరీక్షగా మారాయి. బిల్లులు సభ ముందుకు వస్తాయా? వస్తే విపక్షాలు అడ్డుకుంటాయా? జేపీసీకి పంపుతారా? లేక రాజకీయ బేరసారాలతో మార్గం సుగమం చేస్తారా? ఇదే ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ సీన్. విద్యార్థులపై పోలీసుల చర్యకు చర్చకు కేంద్రం ఓకే చెప్పినా.. అసలు ఫైట్ మాత్రం డీలిమిటేషన్ చుట్టూనే తిరుగుతోంది. కాంగ్రెస్ జేపీసీ ప్రతిపాదనను తిరస్కరించింది. డీఎంకే ఎఫ్సీఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్సీఆర్ఏపై కేంద్రం కొంత వెనక్కి తగ్గి.. డీలిమిటేషన్‌కు మద్దతు కూడగట్టే వ్యూహం తెరపైకి వచ్చింది. మరోవైపు అవసరమైన రెండింట మూడొంతుల సంఖ్యాబలం తమకు ఉందని కేంద్రం చెబుతోంది. అయినా బిల్లు ఎందుకు ముందుకు రావడం లేదు అన్నదే అసలు ప్రశ్న. మోదీతో ఎన్సీపీ ఎంపీల భేటీ, స్పీకర్ చొరవ, అమిత్ షా వరుస చర్చలు.. అన్నీ కలిపి ఢిల్లీలో రాజకీయ వేడి పెంచుతున్నాయి. రెండు రోజుల్లో బిల్లు రాకపోతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అవకాశంపైనా చర్చ మొదలైంది. అంటే.. చివరి మూడు రోజులు సభలో కేవలం చర్చలు కాదు.. డీలిమిటేషన్‌పై అసలు రాజకీయ ఆట మొదలయ్యే సమయం!
జూలై 20న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 13న ముగియనున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం వేయబోయే అడుగుపై ఉత్కంఠ నెలకొంది. గత 16 రోజులుగా విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై పార్లమెంట్లో తీవ్ర గందరగోళం కొనసాగింది. కొన్ని బిల్లులు ఆమోదం పొందినా.. కీలకమైన ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. విద్యార్థులు పార్లమెంట్ వైపు చేపట్టిన మార్చ్‌పై జూలై 20న జరిగిన పోలీసు చర్యపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో విపక్షాల డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చకు సమాధానం ఇస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే విపక్షాలు చర్చకు సిద్ధంగా ఉండి హోంమంత్రి చెప్పే అంశాలను వినాలని షరతు పెట్టింది.
స్పీకర్ ప్రతిపాదనపై కాంగ్రెస్ నో
డీలిమిటేషన్ అంశంపై విపక్షాల మధ్య కూడా పూర్తి ఏకాభిప్రాయం కనిపించడం లేదు. సమాజ్‌వాదీ పార్టీ అయోధ్య రామమందిర్లో కానుకల చోరీ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం డీలిమిటేషన్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. లోక్‌సభ స్పీకర్ డీలిమిటేషన్ సహా వివాదాస్పద బిల్లులను జేపీసీకి పంపే అవకాశాన్ని సూచించినట్లు కాంగ్రెస్ నేత కే.సీ. వేణుగోపాల్ వెల్లడించారు. అయితే బిల్లును జేపీసీకి పంపడం పరిష్కారం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రభుత్వం బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్‌ను కలిసిన తర్వాత అమిత్ షా కూడా స్పీకర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
డీఎంకేతో డీల్.. ఎఫ్సీఆర్ఏపై ట్విస్ట్?
మిగిలిన మూడు రోజుల్లో ఎఫ్సీఆర్ఏ, డీలిమిటేషన్ బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఇంకా ఉందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలతో రాజకీయ అవగాహనకు వెళ్లే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎఫ్సీఆర్ఏ బిల్లుపై కొంత వెనక్కి తగ్గి డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు పొందే ప్రయత్నం జరగవచ్చని తెలుస్తోంది. విపక్షాలను సంతృప్తిపరిచేలా ఎఫ్సీఆర్ఏ బిల్లులో కొన్ని సవరణలు చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత మిజోరం ముఖ్యమంత్రి భేటీ తర్వాత, ఎఫ్సీఆర్ఏ బిల్లును ఆగస్టు 12న చర్చకు తీసుకువచ్చి ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మిగిలిన రోజుల్లో పార్లమెంట్ షెడ్యూల్‌పై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో డీలిమిటేషన్ బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారన్నది మాత్రం ఇంకా స్పష్టంగా లేదు.
మూడు రోజుల్లో తేలుతుందా?
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది లోక్‌సభ ఎంపీలు ప్రధాని మోదీని కలిశారు. మహారాష్ట్రలో కరువు, తీవ్ర వర్షాభావ పరిస్థితులపై చర్చించడమే భేటీ ఉద్దేశమని చెబుతున్నా.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే రాజకీయ ప్రయత్నంగా కూడా దీనిని చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణలతో కలిపి డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన రెండింట మూడొంతుల మెజారిటీ తమకు ఉందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. అవసరమైన సంఖ్యాబలం ఉన్నప్పుడు బిల్లులను ఎందుకు ప్రవేశపెట్టడం లేదన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. విపక్షాలు వరుస అంశాలను తెరపైకి తెచ్చి సభను స్తంభింపజేయాలని చూస్తున్నాయని కేంద్ర వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు విపక్షాలు తమ అభ్యంతరాలను పక్కన పెట్టి బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం తొందరపడుతోందని విమర్శిస్తున్నాయి. మిగిలిన రెండు రోజుల్లో డీలిమిటేషన్ బిల్లుపై నిర్ణయం రాకపోతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. దీంతో చివరి మూడు రోజులు కేంద్రం, విపక్షాల మధ్య కీలక రాజకీయ పోరుగా మారనున్నాయి.
#DelimitationBill #Delimitation2026 #ParliamentSession #ParliamentDeadlock #MonsoonSession #NarendraModi #AmitShah #Congress #DMK #FCRABill #JPC #LokSabha #IndianPolitics #ParliamentNews #IndiaNews











