వెనక్కి పంపాల్సిందేనన్న విపక్షాలు
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు బుధవారం లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం మిత్రపక్షాలు, ఇతర పార్టీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బిల్లును ప్రస్తుత రూపంలో పూర్తిగా ఉపసంహరించుకోవాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ అంశంపై మంగళవారం రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీవ్ర వాదనలు జరిగాయి. ప్రభుత్వం మాత్రం బిల్లును ఉపసంహరించుకునే అంశంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.
విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ బిల్లు సమావేశ అజెండాలోనే లేదని, తమ పార్టీ దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతోందని స్పష్టం చేశారు. టీఎంసీ నేత సాగరికా ఘోష్ కూడా ఇదే డిమాండ్ చేశారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ బిల్లు ప్రస్తుత రూపంలో తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. జేపీసీకి పంపడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్ర మాత్రం బిల్లును జేపీసీకి పంపి మరోసారి పరిశీలించాలని సూచించినట్లు సమాచారం.
ఆస్తులపై కొత్త అధికారాలు
మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ముఖ్యంగా ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయినా, సంస్థ స్వచ్ఛందంగా వదులుకున్నా లేదా గడువు ముగిసినా.. విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులు, వాటితో సృష్టించిన ఆస్తులు ప్రభుత్వ నియమిత అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్లేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ముందస్తు విచారణ లేదా న్యాయపరమైన నిర్ణయం లేకుండానే ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉండటం వివాదానికి కారణమైంది.
మైనారిటీ సంస్థలపై ప్రభావమా?
నిర్దిష్ట గడువులో కొత్త ఎఫ్సీఆర్ఏ సర్టిఫికెట్ పొందకపోతే ఆస్తులను విక్రయించడం లేదా ప్రభుత్వ శాఖకు బదిలీ చేయడం, వచ్చిన మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ చేయడం వంటి నిబంధనలు ప్రతిపాదించారు. తిరిగి రిజిస్ట్రేషన్ పొందినా పాత ఆస్తులను తిరిగి పొందే హక్కును తొలగించే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిబంధనలు క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు, మైనారిటీ విద్యా, సంక్షేమ సంస్థలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం మాత్రం బిల్లుకు మతపరమైన సంబంధం లేదని, అన్ని విదేశీ నిధుల నియంత్రణను బలోపేతం చేయడమే లక్ష్యమని చెబుతోంది.
#FCRABill #FCRAAmendmentBill #JPC #Parliament #LokSabha #RajyaSabha #IndianParliament #Opposition #CentralGovernment #Congress #TMC #DMK #ForeignFunding #NGOs #IndianPolitics #ParliamentMonsoonSession











