Home National_news పార్లమెంట్‌లో కీలక బిల్లులకు బ్రేక్ మూడే రోజులు.. బిల్లులు పాసయ్యేదెలా?

పార్లమెంట్‌లో కీలక బిల్లులకు బ్రేక్ మూడే రోజులు.. బిల్లులు పాసయ్యేదెలా?



పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగింపునకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలాయి. ఆగస్టు 13తో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో కీలక బిల్లులపై ఉత్కంఠ పెరిగింది. మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లులు ఇంకా లోక్‌సభ ఎజెండాలో కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. చివరి దశలో కేంద్రం ఈ బిల్లులను సభ ముందుకు తీసుకొస్తుందా? లేక సమావేశాలు ముగిసే వరకు పెండింగ్‌లోనే ఉంచుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

33 శాతం మహిళా కోటాపై ఉత్కంఠ

కాంగ్రెస్‌ సహా ప్రధాన విపక్ష పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ అంశాలపై కొన్ని విపక్ష పార్టీలు తమ వైఖరిని కొంత మెత్తబరిచినా.. కాంగ్రెస్‌ మాత్రం కేంద్రం ప్రతిపాదనలను గట్టిగా ప్రశ్నిస్తోంది. దీంతో చివరి మూడు రోజుల్లో సభలో మరోసారి తీవ్ర రాజకీయ ఘర్షణ తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే ప్రతిపాదనతో పాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే అంశం కూడా డీలిమిటేషన్‌ బిల్లులో ఉంది. ఈ రాజ్యాంగ సవరణకు రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం. గతంలో అవసరమైన మద్దతు లభించకపోవడంతో బిల్లు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ దీనిని తెరపైకి తీసుకురావడంపై ఉత్కంఠ నెలకొంది.

ఎఫ్‌సీఆర్‌ఏ- హైఓల్టేజ్‌ ఫైట్‌

విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థలపై నియంత్రణలను కఠినతరం చేసేలా ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజా వ్యతిరేకమని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంగా కూడా ఆరోపిస్తోంది. దీంతో ఈ బిల్లుపై కూడా సభలో తీవ్ర ప్రతిఘటనకు అవకాశం ఉంది. మూడు రోజులు తమ ఎంపీలంతా సభకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్‌ విప్‌లు జారీ చేశాయి. దీంతో కీలక బిల్లులపై పోరుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎజెండాలో సాధారణ బిల్లులు ముందుకు సాగుతుంటే.. మరోవైపు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌, ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లులు మాత్రం పెండింగ్‌లో ఉండటం ఆసక్తిని పెంచుతోంది.

 

#Parliament #ParliamentSession #MonsoonSession #DelimitationBill #WomenReservationBill #WomenQuota #FCRABill #ParliamentDeadlock #LokSabha #BJP #Congress #NarendraModi #IndianPolitics #ParliamentNews #IndiaNews