వివరణ ఇచ్చిన బొండా ఉమా.
వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుతో ఒకే వేదిక పంచుకున్న వ్యవహారంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లిన ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు కమిటీ ముందు హాజరయ్యారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తూ తన వైఖరిని స్పష్టం చేశారు.
పార్టీ లైన్ దాటలేదన్న బోండా
మీడియాతో మాట్లాడిన బొండా ఉమా తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని, భవిష్యత్తులో కూడా దాటబోనని స్పష్టం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఎల్లప్పుడూ శిరసావహిస్తానని చెప్పారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయడమే తన బాధ్యత అని వెల్లడించారు. ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లిన సమయంలో పరిస్థితుల కారణంగా వైఎస్సార్సీపీ నేతలను కలవాల్సి వచ్చిందని బొండా ఉమా తెలిపారు. ఆ ఘటనను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని మండిపడ్డారు. తాను అనని మాటలను కూడా ప్రచారం చేశారని ఆరోపించారు. కొన్ని దుష్టశక్తులు తనపై బురదజల్లే ప్రయత్నం చేశాయని విమర్శించారు.
సమన్వయ లోపమేనన్న బొండా
ఈ వ్యవహారం పూర్తిగా సమన్వయ లోపం వల్లే జరిగిందని పార్టీ పెద్దలకు వివరించినట్లు బొండా ఉమా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుతో ఒకే వేదికపై కూర్చొని మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో స్వయంగా పార్టీ నాయకత్వాన్ని కలిసి వివరణ ఇవ్వడం ద్వారా వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.











