తెలంగాణలో కొత్త డిజిటల్ సేవ
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో కీలక డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ వ్యవస్థను ప్రారంభించింది. దీని ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ (ఎఫ్ఆర్సీ) జారీ చేయనుంది. ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల వివరాలను ఒకే డిజిటల్ రికార్డులో భద్రపరచడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యం.
రేషన్ కార్డే ప్రధాన ఆధారం
రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో నెం.172 ప్రకారం ఫ్యామిలీ రిజిస్టర్‌ను పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న రేషన్ కార్డు డేటా ఆధారంగా రూపొందిస్తారు. రేషన్ కార్డు నంబరే ఫ్యామిలీ రిజిస్టర్ గుర్తింపు సంఖ్యగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పేర్లు, కుటుంబ పెద్దతో సంబంధం, వయసు, జనన తేదీ, లింగం, ఆధార్ వివరాలు, నివాస చిరునామా వంటి సమాచారం ఇందులో నమోదవుతుంది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రేషన్ కార్డు నంబర్ నమోదు చేసి నిర్ణయించిన రుసుము చెల్లిస్తే దరఖాస్తు స్వీకరిస్తారు. రెండు రోజుల్లో సర్టిఫికెట్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పేద కుటుంబాలకు ఊరట
ఈ సేవను సమర్థంగా అమలు చేయడానికి ఫుడ్ సెక్యూరిటీ కార్డు డేటాబేస్‌తో ఏపీఐ అనుసంధానం చేపట్టాలని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్‌కు సూచించింది.
ఫ్యామిలీ రిజిస్టర్ వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు పదేపదే వివిధ పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ ఒకే సర్టిఫికెట్ ద్వారా పూర్తికావడంతో ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడం మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల కలెక్టర్లు ఈ సేవ అమలును పర్యవేక్షించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
#TelanganaFamilyRegister #FamilyRegisterCertificate #FRC #TelanganaGovernment #MeeSeva #DigitalServices #EGovernance #RationCard #TelanganaNews #OnlineServices #GovernmentServices #DigitalTelangana #CitizenServices #BreakingNews #Telangana











