అపరిశుభ్ర హోటళ్లపై ఉక్కుపాదం మోపండి.. ప్రత్యేక తనిఖీలకు వినతి

Proddatur Hotel Hygiene Inspections

హోటళ్లపై ప్రత్యేక నిఘా,  ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యం
ప్రొద్దుటూరు పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ స్టాల్స్‌లో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని లోకా సమస్త హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం వినతిపత్రం సమర్పిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు అవసరమని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో హోటళ్లు, ఫుడ్ సెంటర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల పరిశుభ్రత లోపాలు కనిపిస్తున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు. నాణ్యత లేని వంట నూనెలు, నాసిరకం ముడి పదార్థాల వినియోగంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల రామేశ్వరం రోడ్డులోని ఓ హోటల్‌లో చట్నీలో బల్లి కనిపించిన ఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని గుర్తు చేశారు.

కఠిన చర్యలు కోరిన ప్రతినిధులు
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించాలని వినతిపత్రంలో కోరారు. ఫుడ్ లైసెన్సులు, ఉద్యోగుల ఆరోగ్య ధ్రువపత్రాలను పరిశీలించాలని, నిర్వాహకులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలు అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ ఏపీ రాష్ట్ర చైర్మన్ జె. శ్రీనివాసులు, ఏపీ లీగల్ అడ్వైజర్ సి.వి. జయలక్ష్మి, సభ్యులు సుధీర్, వెంకట్, నరసింహ, కుమార్, సత్య, రఫీ, ఎలయ్య, అస్మాద్, మహేష్, గౌస్ పాల్గొన్నారు.

మహేష్ పోసా
ప్రొద్దుటూరు
+917337378783