విద్యా సంస్కరణలపై అధ్యయనం.. కెనడా పర్యటనకు అనుమతి
రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు చేరువ చేసే లక్ష్యంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల బృందం కెనడా పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల 25 నుంచి ఆగస్టు 2 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అండ్ ఇమ్మర్షన్ ట్రావెల్ ప్రోగ్రామ్’లో భాగంగా ఈ టూర్ ఖరారైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అనుమతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఉన్నతాధికారుల బృందం
ఈ బృందంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేశ్ ధోత్రే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. కుమార్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు రవీంద్రనాథ్ సోలమన్, పల్లవి కాబ్దే సభ్యులుగా ఉన్నారు.
విద్యా విధానాలపై అధ్యయనం
కెనడాలో అమలవుతున్న విద్యా విధానాలు, విశ్వవిద్యాలయాల్లో అమలు చేస్తున్న ఆధునిక బోధనా పద్ధతులు, విద్యా నిర్వహణ విధానాలను ఈ బృందం పరిశీలించనుంది. అక్కడి అనుభవాలను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అధ్యయనం చేసి, ఉన్నత విద్యా రంగంలో నాణ్యత పెంచే మార్గాలను గుర్తించనుంది.
30 రోజుల్లో నివేదిక
పర్యటన ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా నేర్చుకున్న అంశాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలో అంతర్జాతీయ స్థాయి మార్పులు తీసుకొచ్చే చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.











