Home Telangana జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు పేదలకు చేరువలో నివాసం

జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు పేదలకు చేరువలో నివాసం


నిరుపయోగ స్థలాలను గుర్తించండి.
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం.

క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాలకు దూరంగా కాకుండా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఇళ్లు ఉంటేనే పేద కుటుంబాల జీవనం సులభమవుతుందని అధికారులకు సూచించారు. దూర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తే ప్రజలు అక్కడ నివసించలేక ఖాళీగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే పని ప్రదేశాలకు సమీపంలోనే ఇందిరమ్మ గృహాలను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

నిరుపయోగ ప్రభుత్వ భూముల గుర్తింపు

ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖల పరిధిలో ఉపయోగం లేకుండా ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సమీక్షలో వివరించారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖల ఆధీనంలో ఉన్న నిరుపయోగ స్థలాలను గృహ నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. అవసరమైతే సంబంధిత శాఖలకు మరోచోట ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను సమర్థంగా వినియోగించి పేదలకు గృహాలు అందించడమే లక్ష్యమని తెలిపారు.

ఫ్లాట్ వివరాలు ఇలా

క్యూర్ ఏరియాలోని పేదల కోసం ప్రభుత్వం నిర్మించనున్న ప్రతి ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఉండనుంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు రూ.11 లక్షలు ఖర్చు కానుండగా ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. భూమి వ్యయాన్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో నగర పరిధిలో సొంత ఇల్లు సాధ్యం కాని వేలాది పేద కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది.

17 నియోజకవర్గాల్లో తొలి దశ

మొదటి విడతలో 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ఈ ఇళ్లు నిర్మించనున్నారు. సంబంధిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వేగంగా గుర్తించి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో నగర పేదలకు ఉపాధికి దగ్గరగా, మౌలిక సదుపాయాలతో కూడిన శాశ్వత నివాసాలు అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

 

#RevanthReddy #IndirammaHouses #TelanganaHousing #TelanganaGovernment #AffordableHousing #HyderabadDevelopment #PoorFamilies #GovernmentLands #IndirammaScheme #UrbanHousing #TelanganaNews #Development