ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు
స్పష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు
రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదు
జంతర్ మంతర్ నుంచి కదిలేదు లేదు
తేల్చి చెబుతున్న కాక్రోచ్ పార్టీ నేతలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు… ఉద్యమం ఆగదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇదే తుది నిర్ణయమని తేల్చి చెబుతున్నాయి. మరోవైపు “మంత్రి పదవి వీడే వరకు జంతర్ మంతర్ ఖాళీ కాదు” అంటూ కాక్రోచ్ జనతా పార్టీ నేతలు స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది… ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందా? ఉద్యమం తీవ్రరూపం దాల్చితే ప్రతిపక్షాలు మరింత దూకుడు పెంచుతాయా? ఇప్పటికే విద్యార్థుల ఆగ్రహం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. పార్లమెంట్ ముట్టడి, పోలీసు చర్యలు, నిరాహార దీక్షలు, చర్చలు… ప్రతి ఘట్టం ఉద్రిక్తతను మరింత పెంచుతోంది. ప్రభుత్వం మాత్రం పేపర్ లీక్‌లపై కఠిన చర్యలే పరిష్కారమని చెబుతోంది. ఉద్యమకారులు మాత్రం “రాజీనామా ఒక్కటే న్యాయం” అంటున్నారు. దీంతో రెండు వైపులా ఎవ్వరూ తగ్గని పరిస్థితి ఏర్పడింది. శనివారం కేంద్రం చెప్పే నిర్ణయం కీలక మలుపు కావొచ్చు. అది రాజీకి దారితీస్తుందా? లేక దేశ రాజకీయాలను మరోసారి కుదిపేసే కొత్త దశకు నాంది పలుకుతుందా?
రాజీనామా తూచ్ అంటున్న కేంద్రం
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశమే లేదని ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేశాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రస్తుతం అసలు పరిశీలనలో లేదని తేల్చిచెప్పాయి. మంత్రి పట్ల ప్రభుత్వం పూర్తి నమ్మకంతో ఉందని, రాజీనామా తీసుకోవడం అత్యంత సులభమైన నిర్ణయం మాత్రమేనని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలు ఇచ్చిన ప్రజాభిమానానికి తగ్గట్టే బాధ్యతగా వ్యవహరిస్తామని కూడా స్పష్టం చేశాయి.

సీజేపీ డిమాండ్ మాత్రం యథాతథం
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విద్యార్థులు మాత్రం తమ డిమాండ్‌పై ఎలాంటి రాజీకి సిద్ధంగా లేరు. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే ఉద్యమం విరమిస్తామని మరోసారి ప్రకటించారు. కేంద్రంతో జరిగిన రెండో విడత చర్చల్లో కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. మరోవైపు విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ, ఆత్మహత్యలకు పాల్పడిన నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అంశాలకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని సీజేపీ నేతలు వెల్లడించారు. అయితే మంత్రి రాజీనామా అంశంపై శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరిందని తెలిపారు.

పేపర్ లీక్‌లపై చర్యలు వేగం
జాతీయ పరీక్షల సంస్థలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని త్వరలోనే సరిదిద్దుతామని కేంద్రం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీక్‌లకు పాల్పడిన అనేక ముఠాలను ఇప్పటికే ఛేదించామని, మరిన్ని కఠిన చర్యలు త్వరలోనే తీసుకుంటామని వెల్లడించింది. ఇదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ తన అధికారిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ సమావేశాల్లో పాల్గొనడం, విద్యా సంబంధిత అంశాలపై చర్చించడం, సామాజిక అంశాలపై స్పందించడం కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచిన సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఉద్యమం కొనసాగుతుందా..?
సోనం వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించినా, సీజేపీ నేతలు మాత్రం ఉద్యమాన్ని కొనసాగించే సంకేతాలు ఇస్తున్నారు. పార్లమెంట్ ముట్టడి ప్రయత్నాల తర్వాత దేశ రాజకీయాల్లో ఈ అంశం మరింత వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే పరిష్కారమని పట్టుబడుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం చర్చలకు సిద్ధమే తప్ప మంత్రి రాజీనామా అంశంలో వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో రానున్న రోజుల్లో ఈ వివాదం రాజకీయంగా మరింత ఉత్కంఠ రేపే అవకాశం కనిపిస్తోంది.











