ఆడబిడ్డలకు అండగా దేవాంగ కుల సంఘాల నేతలు
తల్లిదండ్రుల అండ కోల్పోయిన ముగ్గురు ఆడబిడ్డల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచింది మానవత్వం. అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ ఇటీవల పక్షవాతంతో మృతి చెందగా, ఇప్పటికే మానసిక దివ్యాంగురాలైన తల్లి సత్యవతిని చూసుకోవాల్సిన బాధ్యత మైనర్ కుమార్తెల భుజాలపై పడింది. పెద్ద కుమార్తె ప్రసన్నలక్ష్మి ఐస్ పార్లర్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కవలలు జ్యోతిక, జ్యోత్స్న పదో తరగతి చదువుతున్నారు. ఈ కుటుంబం ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి తెలుసుకున్న ఏలూరుకు చెందిన దేవాంగ కళ్యాణ మండపం గ్రూప్ అడ్మిన్ కొండపల్లి పరమేశ్వరరావు సహాయం కోసం పిలుపునివ్వగా, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దాతలు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
దాతల విరాళాలతో మొత్తం రూ.3,06,729 సమకూరగా, ఆ మొత్తాన్ని శుక్రవారం కె. జగన్నాధపురంలో ఆడబిడ్డలకు కొండపల్లి పరమేశ్వరరావు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవాంగ సంఘ నాయకులు, చేనేత సంఘ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొని చిన్నారులకు ధైర్యం చెప్పారు. పుల్లేటికుర్రుకు చెందిన లక్కింశెట్టి భాస్కరరావు కూడా అక్కడికక్కడే మరో రూ.5 వేల ఆర్థిక సాయం ప్రకటించి ఉదారత చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి సమాజం అండగా నిలిస్తే జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మానవత్వం, సామాజిక బాధ్యత కలిసొస్తే ఎన్నో కుటుంబాల భవిష్యత్తు వెలుగుతో నిండిపోతుందనే సందేశాన్ని ఈ సహాయ కార్యక్రమం అందించింది.











