నేతన్నలకు ఏడాదికి రూ.25 వేల అండ

The Andhra Pradesh government has launched the Nethanna Seva Scheme, providing ₹25,000 annual financial assistance to 51,952 weavers, along with pensions, free electricity, and other welfare benefits.

113

కొత్త పథకానికి శ్రీకారం

రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘నేతన్న సేవ’ పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 51,952 మంది చేనేత కార్మికులకు ప్రతి ఏడాది రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వచ్చే నెల ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

చేనేత కుటుంబాలకు భారీ లబ్ధి

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. 50 ఏళ్లు దాటిన 85,678 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందుతున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.81,640, మర మగ్గం నేతన్నలకు రూ.94 వేల వరకు ప్రత్యక్ష ఆర్థిక లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

చేనేత రంగానికి ప్రోత్సాహం

రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కొత్త టెక్స్‌టైల్స్ పాలసీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. టెక్స్‌టైల్స్ పార్కులు, క్లస్టర్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్‌కు ప్రతి ఏడాది రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆప్కో చరిత్రలో తొలిసారిగా టీటీడీతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా చేనేత ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.

ప్రగడ కోటయ్యకు రాష్ట్ర స్థాయి గౌరవం

చేనేత రంగ అభివృద్ధికి విశేష సేవలందించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని ఈ నెల 26న రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. చీరాలలో రాష్ట్ర స్థాయి వేడుకలు జరిపి చేనేత రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించనున్నట్లు వెల్లడించారు.

జగన్‌పై మంత్రి విమర్శలు

విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆరోపణలు చేయడం తప్ప వాటిని నిరూపించే పరిస్థితి జగన్‌కు లేదని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.

నేతన్నల సంక్షేమమే లక్ష్యం

చేనేత కార్మికులు గౌరవప్రదంగా జీవించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. నేతన్న సేవ, ఉచిత విద్యుత్, పెన్షన్, సబ్సిడీ వంటి కార్యక్రమాల ద్వారా చేనేత కుటుంబాలకు నిరంతర ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలు చేనేత రంగానికి కొత్త ఊపునిస్తూ వేలాది కుటుంబాల జీవనోపాధికి బలమైన ఆధారంగా నిలుస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

మహేష్ పోసా
అమరావతి
7337378783