ప్రొద్దుటూరులో విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల కోసం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ధర్నా
ప్రొద్దుటూరు: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు నిలిచిపోవడంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ నిర్మాణం సుమారు 80 శాతం పూర్తయిన తర్వాత మిగిలిన పనులు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 20 శాతం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో ప్రజా సమస్య పరిష్కారం కోసం తాను ధర్నాకు దిగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జూలై 25 (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం పత్రికా ప్రకటనలో తెలిపింది. విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి డిమాండ్ చేశారు.











