దస్తావేజు లేఖరుల స్థానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసే జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని ప్రొద్దుటూరు దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని దస్తావేజు లేఖరులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ వ్యవస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారని విమర్శించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంపు రైటర్లు, స్టాంపు వెండర్లు ప్రజలకు సహకరిస్తూ, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పనులను సులభతరం చేసి, వారి తరఫున వివిధ సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి వారి ఉపాధికి భంగం కలిగించే విధంగా ప్రభుత్వం కుట్రపూరితంగా జీవో నెం. 396ను తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నెం. 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దస్తావేజు లేఖరుల సంఘంతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు, ర్యాలీలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించి, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.