Home Telangana నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు కేటీఆర్! కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు కేటీఆర్! కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

10



తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆవేశానికి లోనుకావద్దని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. నిరసనల పేరుతో చట్టపరమైన కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని కోరారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగిస్తూ నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నామని వివరించారు.

గ్రూప్-1పై బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన మంత్రి

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రూప్-1 నియామక ప్రక్రియను కూడా పూర్తి చేయలేదని శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణ ఏర్పడక ముందు 2011లో చివరిసారిగా గ్రూప్-1 పరీక్ష జరిగిందని గుర్తు చేశారు. 2011 నుంచి 2024 వరకు గ్రూప్-1 నియామకాలు ఎందుకు జరగలేదో బీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడినందుకు బీఆర్ఎస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 600 గ్రూప్-1 పోస్టుల భర్తీ పూర్తయిందని మంత్రి తెలిపారు. దశాబ్ద కాలంగా ఎదురు చూసిన అభ్యర్థులు ఇప్పుడు తాండూరు, వికారాబాద్, పరిగి, జగిత్యాల వంటి ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.


జాబ్ క్యాలెండర్‌పై స్పష్టత

బీఆర్ఎస్ పాలనలో ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్‌కు శ్రీధర్ బాబు సవాల్ విసిరారు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ అంశంపై కూడా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. జాబ్ క్యాలెండర్ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కోర్టు వివాదాలు తలెత్తకుండా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో వెనక్కి తగ్గదని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.