Home General ఈఎస్ఐ పథకానికి గడువు పొడిగింపు

ఈఎస్ఐ పథకానికి గడువు పొడిగింపు

బకాయిల వివాదాలకు మరో అవకాశం
3 నెలలపాటు, డిసెంబర్‌ 31 గడువు

ఉద్యోగులు, యజమానులకు సంబంధించిన ఈఎస్ఐ వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ) అమలు చేస్తున్న ‘న్యూ అమ్‌నెస్టీ స్కీమ్‌–2025’ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో ఈ పథకం 2026 సెప్టెంబర్‌ 30తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడు డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉంటుంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. దీంతో ఈఎస్ఐకి సంబంధించిన పెండింగ్‌ కేసులు ఉన్న అర్హులైన యజమానులు, బీమా పొందుతున్న వ్యక్తులకు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు అదనపు సమయం లభించనుంది.

జరిమానాల నుంచి ఉపశమనం

ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఈఎస్ఐకి సంబంధించిన న్యాయవివాదాలను కోర్టుల వెలుపల పరిష్కరించడం. దీనివల్ల పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు నిబంధనల అమలు మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని సందర్భాల్లో యజమానులు చెల్లించాల్సిన అసలు బకాయిలు, వాటిపై వడ్డీ చెల్లిస్తే, అదనపు జరిమానాలు లేకుండా వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బకాయిలు చెల్లించినప్పటికీ జరిమానాలపై వివాదం కొనసాగుతున్న కేసుల్లో, వివాదాస్పద జరిమానాలో 10 శాతం చెల్లించే షరతుతో కేసుల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అయితే ఈ వెసులుబాటు పథకంలోని నిబంధనలకు లోబడి ఉంటుంది.

పాత కేసులకూ వర్తింపు

రికార్డులు సమర్పించకపోవడం, చెల్లింపుల్లో ఆలస్యం వంటి కారణాలతో ఈఎస్ఐ దాఖలు చేసిన కేసుల్లో, సంబంధిత లోపాలను తర్వాత సరిదిద్దినట్లయితే కోర్టు అనుమతితో కేసులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. 2025 మార్చి 31వ తేదీ వరకు దాఖలైన కేసులే ఈ పథకం పరిధిలోకి వస్తాయి. అర్హత ఉన్న యజమానులు గడువు ముగిసేలోపు నిబంధనలను పరిశీలించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వ్యాపార సంస్థలపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయవివాదాల భారం తగ్గించడం, అర్హులైన వారికి ఉపశమనం కల్పించడం ఈ పథకం లక్ష్యాలు. అయితే కేసుల పరిష్కారం ఆటోమేటిక్‌గా జరగదు. సంబంధిత షరతులు, అవసరమైన చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

#ESIC #NewAmnestyScheme2025 #ESI #DeadlineExtension #December312026 #EmployeesStateInsurance #ESIDues #EmployerRelief #LegalDisputes #LabourMinistry #PenaltyRelief #ESICUpdates #IndiaNews