తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ తన ఉనికిని మరింత బలంగా చాటుకోనుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని ఆయన కుండబ ద్దలు కొట్టారు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో నిర్వహించ తలపెట్టిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే ఇక్కడ శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. చచ్చిపోవడానికైనా సిద్ధపడే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఇలాంటి చిన్నపాటి ఆంక్షలకు భయపడే ప్రసక్తే లేదని చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ప్రాంతీయవాదంపై కాంగ్రెస్ తీరుపై నిరసన
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఈ ప్రాంతీయవాదమే కాంగ్రెస్ వాదమా అని ఆయన ప్ర శ్నించారు. ఒక జాతీయ పార్టీ అయి ఉండి ప్రాంతీయ విద్వేషాలను రగల్చడం సరైన పద్ధతి కాదన్నారు. దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లడానికి ఏమైనా పాస్పోర్టులు కావాలా అని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చని, ఇందిరాగాంధీ మెదక్ లో, పీవీ నరసింహారావు నంద్యాలలో పోటీచేయవచ్చని గుర్తు చేశారు. దేశ నాయకులకు లేని ఆంక్షలు, తనకు తెలంగాణలో తిరిగే హక్కు లేదనడానికి వీరెవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నేతలు తనను
భయపెట్టాలని చూస్తున్నారని, కానీ వారు భయపెట్టే కొద్దీ తమ గుండె మరింత గట్టిపడుతుందని స్పష్టం చేశారు.
అప్పట్లో ఊడిగం.. ఇప్పుడేమో గొంతులు
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం లాంటి పా ర్టీలను ఎవరూ ప్రశ్నించడం లేదని, కేవలం జనసేనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకమని బహిరం గంగానే చెప్పారని, అప్పుడు ఇవే కాంగ్రెస్ గొంతులు ఎందుకు లేవలేదని నిలదీశారు. ఆ సమయంలో వైఎస్ఆర్ దగ్గర ఊడిగం చేసిన నేతలే ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారే ఇప్పుడు పెద్ద పదవుల్లో కూర్చుని ఎమ్మెల్యేలు అయ్యారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏపీకి విస్తరించినప్పుడు తాను స్వాగతించానని చెప్పారు.
ఆంధ్ర వారిపై నిందలు సరికాదు
తెలంగాణలో జరిగే ప్రతి సమస్యకు ఆంధ్ర ప్రాంతం వారే కారణమనడం భావ్యం కాదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. తాను ఇప్పటివరకు ఏ ఒక్క తెలంగాణ నాయకుడిని వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదన్నారు. తనకు ప్రజలను రెచ్చగొట్టడం ఇష్టం లేకనే చాలా సందర్భాల్లో తగ్గి ఉన్నానని చెప్పారు. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్లే ఈ వివాదం మొదలైందని, అతనిపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదన్నారు. విషయం తెలిసిన వెంటనే కేసులను వదిలేయమని తానే స్వయంగా చెప్పినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టి తనను ఇష్టమొచ్చినట్లు తిట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు వలసలు తగ్గాలంటే ఏపీ యువతకు అక్కడే ఉద్యోగాలు రావాలని, ప్రాంతీయ అశాంతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
కూటమి సమీకరణాలు.. పదవులపై వ్యాఖ్యలు
రాబోయే 2029 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తమతో కలిసి వస్తుందో లేదో ఇప్పుడు చెప్పలేమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న విమర్శల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, కేసీఆర్ గానీ ఉన్నారని తాను అనుకోవడం లేదన్నారు. గతంలో తనకు మల్కాజ్గగిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినా వదులుకున్నానని, తనకు ఎలాంటి పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో తన పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలిచి ప్రజలకు సేవ చేస్తే చాలన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కు బూర్గుల రామకృష్ణారావు ఒక గొప్ప చిహ్నమని, ఆయన విగ్రహాన్ని ఏపీ తెలంగాణ హైవేపై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆ హైవేకు బూర్గుల రామకృష్ణారావు పేరే పెట్టాలని కోరారు. మాజీ నేతలను ఆ పార్టీలోకి తీసుకున్నా అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు.
ప్రజలు నమ్మేంతవరకు పోరాటం
గతంలో రాష్ట్ర విభజన జరిగిన తీరును నిరసిస్తూ తాను 11 రోజులు అన్నం తినలేదని, దాన్ని కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అన్నం తిననిది తెలంగాణ వచ్చినందుకు కాదు, పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించిన విధానానికి వ్యతిరేకంగానే అని స్పష్టం చేశారు. తెలంగాణ నాయకులు ఎన్నోసార్లు ఆంధ్ర వాళ్లను తిట్టినా తాము భరించామని, పార్టీని ఎలా నడపాలో చెప్పడానికి వేరే వాళ్లెవరో అవసరం లేదన్నారు. తెలంగాణలో జనసేన పని ఇప్పుడే మొదలైందని, ఇక్కడి ప్రజలు తమను పూర్తిగా నమ్మేంతవరకు క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చివరగా ‘జై తెలంగాణ.. జైహింద్” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.










