పోలీస్ స్టేషన్ల తనిఖీలు
ప్రొద్దుటూరులో వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, మౌలిక వసతులు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. విధుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల వినియోగం చట్టరీత్యా నేరమని, అలాంటి అలవాట్లు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డ్రోన్లతో ప్రత్యేక నిఘా
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, సాగును పూర్తిగా అరికట్టేందుకు రెండు డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ అనుమానాస్పద ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. డ్రోన్ల ద్వారా గుర్తించిన అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ తెలిపారు. ఎన్నికల సమయంలో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.











