Home AP మార్కాపురం పేరులో చంద్రన్న ముద్ర?

మార్కాపురం పేరులో చంద్రన్న ముద్ర?


జిల్లా పేరుపై ఎమ్మెల్యే సంచలన ప్రతిపాదన.
చిరకాల కల నెరవేరిన వేళ కొత్త డిమాండ్‌.

పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక జిల్లా ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మార్కాపురం జిల్లా పేరును మార్చాలన్న ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మార్కాపురం జిల్లాకు “చంద్రన్న మార్కాపురం”గా పేరు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వినతిపత్రం అందించారు. జిల్లా పేరును మార్చుతూ శాసనసభలో తీర్మానం చేయాలని స్పీకర్‌ను కోరారు. ఇది కేవలం ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం కాదని, మార్కాపురం ప్రాంత ప్రజల కోరికగా ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.

అసలు చంద్రబాబు పేరే ఎందుకు?

ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన కారణం మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి ప్రత్యేక జిల్లా కావాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీల్లో ఈ అంశం కూడా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. 2026 జనవరి నుంచి మార్కాపురం జిల్లా అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీంతో తమ ప్రాంత చిరకాల డిమాండ్‌ను నెరవేర్చిన చంద్రబాబుకు కృతజ్ఞతగా జిల్లా పేరులో ఆయన పేరును చేర్చాలని ఎమ్మెల్యే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా చూస్తే ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతగా తీసుకున్న ప్రతిపాదనగా కనిపిస్తోంది.

నాలుగు నియోజకవర్గాలతో కొత్త జిల్లా

మార్కాపురం కేంద్రంగా ఏర్పడిన జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. కొత్త మార్కాపురం జిల్లాలో 21 మండలాలు, 508 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాకు సుమారు 14.83 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇదే సమయంలో మార్కాపురం కేంద్రంగా పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, కనిగిరి మున్సిపాలిటీలతో పాటు 21 మండలాలను కలుపుతూ అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు “చంద్రన్న మార్కాపురం” పేరు వస్తుందా? లేక ప్రస్తుత మార్కాపురం పేరే కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే ఇచ్చిన వినతిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే తదుపరి అడుగు ఆధారపడి ఉంది.

 

#Markapuram #ChandrannaMarkapuram #ChandrababuNaidu #KandukuriNarayanaReddy #MarkapuramDistrict #AndhraPradesh #APPolitics #DistrictRenaming #WesternPrakasam #AyyannaPatrudu #APGovernment #MarkapuramMLA #Prakasam #AndhraPolitics #DistrictNameChange