రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ రాయలసీమ టాస్క్‌ఫోర్స్, రైతు, యువజన, విద్యార్థి విభాగాల సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. శ్రీశైలం జలాశయంలో దాదాపు 180 టీఎంసీలకు పైగా నీరు ఉన్నా రాయలసీమ రిజర్వాయర్లు సగం కూడా నిండలేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 40,400 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే కేవలం 8 వేల క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నారని విమర్శించారు. వెలుగోడు, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు, గోరకల్లు, గండికోట, చిత్రావతి వంటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రైతుల నీటి హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న పోతిరెడ్డిపాడు వద్ద భారీ ప్రజా పోరాటం చేపడతామని ప్రకటించారు.
లిఫ్ట్ ఇరిగేషన్ రద్దుపైనా విమర్శలు
రాయలసీమకు నీటి భద్రత కల్పించే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం నిలిపివేసిందని శైలజానాథ్ ఆరోపించారు. హంద్రీ-నీవా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను రద్దు చేసి సామర్థ్యాన్ని తగ్గించారని విమర్శించారు. సీమ ప్రాజెక్టులకు నీరు అందకుండా అడ్డుకుంటున్న నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, అప్పర్ భద్ర ప్రాజెక్టు వంటి అంశాలపై కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి మార్గాల ద్వారా పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేసి రాయలసీమ రిజర్వాయర్లను నింపాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని శైలజానాథ్ హెచ్చరించారు.
#Rayalaseema #RayalaseemaDevelopment #RayalaseemaWaterRights #YSRCP #SakheShailajanath #ChandrababuNaidu #Pothireddypadu #SrisailamReservoir #RayalaseemaIrrigation #HandriNeeva #LiftIrrigation #RayalaseemaFarmers #AndhraPradeshPolitics #WaterRights #YSRCPProtest











