Home National_news డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే సిరప్‌లు

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే సిరప్‌లు

34

ఔషధ సిరప్‌ల విక్రయాలపై కేంద్రం ఉక్కుపాదం

భారతదేశంలో దగ్గు సిరప్‌లతో పాటు అన్ని రకాల ద్రవరూప ఔషధాల… సిరప్స్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి సిరప్ ఆధారిత మందులనైనా కొనుగోలు చేయాలంటే రిజిస్టర్డ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. సాధారణంగా మెడికల్ షాపులలో ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మందులు కొనుగోలు చేసే…ఓవర్ ది కౌంటర్ విధానానికి ఈ నిర్ణయంతో పూర్తిగా తెరపడింది.

డ్రగ్స్ నిబంధనలకు కీలక సవరణ
కేంద్ర ప్రభుత్వం 1945 నాటి డ్రగ్స్ నిబంధనలకు సవరణలు చేస్తూ జూన్ 9న అధికారిక గెజెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ‘డ్రగ్స్ ఐదో సవరణ… నిబంధనలు 2026’ ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. అంతకుముందు కొన్ని మినహాయింపులు ఉన్న షెడ్యూల్ కె, జాబితా నుండి ‘సిరప్స్’ అనే పదాన్ని పూర్తిగా తొలగించారు. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టపరమైన మార్పులను తీసుకువచ్చింది.

స్వయం వైద్యం ముప్పుకు చెక్
చాలా ఏళ్లుగా మనదేశంలో దగ్గు సిరప్‌లు, ఇతర ద్రవరూప మందులు ఎలాంటి నిబంధనలు లేకుండా సులభంగా లభించేవి. దీనివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. ప్రజలు తమకు తామే సొంతంగా మందులు వాడుకోవడం…సెల్ఫ్ మెడికేషన్, అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో సిరప్‌లు తాగడం వల్ల ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ దురలవాటును అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నకిలీ ఔషధాల నియంత్రణే ధ్యేయం
గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ, కలుషిత దగ్గు సిరప్‌ల వల్ల కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఔషధాల నాణ్యత, భద్రతపై అంతర్జాతీయంగా కూడా పలు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫార్మాస్యూటికల్ రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి, మందుల దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ కఠిన నిబంధనలు అవసరమని అధికారులు భావించారు. రోగుల భద్రతను మెరుగుపరచడం, ప్రజలు ఏదైనా అనారోగ్యం వస్తే సొంత వైద్యం చేసుకోకుండా అర్హులైన వైద్యులను సంప్రదించేలా ప్రోత్సహించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.