Home National_news ఎంటరైతే ఎలిమినేషన్ షురు

ఎంటరైతే ఎలిమినేషన్ షురు

14


బరితెగించిన బంగ్లా సర్కారు.
హసీనాకు హై అలర్ట్ వార్నింగ్.

మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తే వెంటనే జైలుకు పంపిస్తామని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హసీనా స్వచ్ఛందంగా లొంగిపోయినా చట్ట ప్రక్రియలో భాగంగా ముందుగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

డిసెంబర్‌లో తిరుగు ప్రయాణం?

షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్‌లో ఢాకాకు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ నిర్ణయం పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ వార్తల నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని మరింత స్పష్టంగా వెల్లడించింది. భారత్‌లో ఉన్నా, బంగ్లాదేశ్‌కు వచ్చినా చట్టం అందరికీ ఒకటేనని మంత్రి పేర్కొన్నారు.

మరణశిక్ష విధించిన ప్రత్యేక న్యాయస్థానం

2024 ఆగస్టు 5న విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ నిరసనల తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దేశవ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో ఆమె ఢాకా విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే నివసిస్తున్నారు. అప్పటి రాజకీయ పరిణామాలు బంగ్లాదేశ్ చరిత్రలో కీలక మలుపుగా నిలిచాయి. గత ఏడాది నవంబర్‌లో ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ షేక్ హసీనాకు గైర్హాజరులోనే మరణశిక్ష విధించింది. 2024 విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో మానవత్వానికి వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ తీర్పు వెలువడింది. అయితే ఈ కేసులు, తీర్పులు రాజకీయ ప్రేరేపితమైనవేనని హసీనా ఇప్పటికే ఖండించారు.

భారత్‌ను కోరుతున్న ఢాకా

తీర్పు వెలువడిన తర్వాత షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది. ఆమెను తిరిగి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియ గత తాత్కాలిక ప్రభుత్వం హయాంలోనే ప్రారంభమైందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. ప్రస్తుతం బీఎన్‌పీ నేతృత్వంలోని ప్రభుత్వం అదే ప్రక్రియను కొనసాగిస్తోందని చెప్పారు. హసీనా విదేశాల నుంచి చేస్తున్న వ్యాఖ్యలు అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నంగానే కనిపిస్తున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న పార్టీ నాయకులకు ఆమె సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. హసీనా తిరిగి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు పూర్తిగా చట్టపరమైన ప్రక్రియ ఆధారంగానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.