Home AP ఏపీలో కొత్త మద్యం పాలసీ 3,736 షాపులకు సర్కార్ ఆమోదం

ఏపీలో కొత్త మద్యం పాలసీ 3,736 షాపులకు సర్కార్ ఆమోదం

మరో ఏడాది పాటు సాగనున్న షాప్స్ .

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎక్సైజ్‌ షాప్స్‌ పాలసీ 2026–27ను ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3,736 రిటైల్‌ మద్యం దుకాణాలనే మరో ఏడాది కొనసాగించనుంది. ఈ పాలసీ 2026 అక్టోబర్‌ 1 నుంచి 2027 సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుంది. మొత్తం షాపుల్లో 3,396 ఓపెన్‌ కేటగిరీలో, 340 షాపులను గీత కులాలకు కేటాయించారు. ఇప్పటికే లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు ఏడాది పాటు లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు వార్షిక రెట్‌తో పాటు దాని 38 శాతం రెన్యువల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. 2026–27 వార్షిక రెట్ రేట్లను గత ఏడాది స్థాయిలోనే కొనసాగించారు. జనాభా ఆధారంగా రెన్యువల్‌ రె‌ట్‌ను ఓపెన్‌ కేటగిరీలో రూ.23 లక్షల నుంచి రూ.35.5 లక్షల వరకు, గీత కులాల షాపులకు రూ.11.5 లక్షల నుంచి రూ.17.8 లక్షల వరకు నిర్ణయించారు. రెన్యువల్‌ కోరే లైసెన్సీలకు రూ.35 వేల ప్రాసెసింగ్‌ ఫీజు ఉంటుంది. రెన్యువల్‌ చేయని షాపులను డ్రా ఆఫ్‌ లాట్స్‌ ద్వారా కేటాయించనున్నారు.

డిజిటల్‌ నిఘా.. అక్రమాలకు భారీ జరిమానా

కొత్త పాలసీలో మద్యం వ్యాపారంపై డిజిటల్‌ పర్యవేక్షణను మరింత కఠినతరం చేశారు. ఉత్పత్తి కేంద్రం నుంచి రిటైల్‌ విక్రయం వరకు ఎండ్‌ టు ఎండ్‌ ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం అమలు చేయనున్నారు. డిజిటల్‌ స్టాక్‌, విక్రయ రికార్డులతో పాటు ఈ-ఇన్వెంటరీని పర్యవేక్షిస్తారు. ప్రతి షాపులో నాలుగు సీసీ కెమెరాలు తప్పనిసరి. విక్రయ కౌంటర్‌, స్టాక్‌ ప్రాంతం, వినియోగదారుల ప్రాంతం, అవసరమైతే పర్మిట్‌ రూమ్‌ను కెమెరాలు కవర్‌ చేయాలి. ఇవి ఏఐ ఆధారిత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమవుతాయి. ఉద్దేశపూర్వకంగా కెమెరాలను ట్యాంపర్‌ చేస్తే చర్యలు తీసుకుంటారు. పదేపదే ఉల్లంఘిస్తే లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఎంఆర్‌పీ ఉల్లంఘన, అక్రమ విక్రయాలు, నకిలీ మద్యం, బ్రాండ్‌ కల్తీ, డైల్యూషన్‌పై కఠిన నిబంధనలు విధించారు. అక్రమ విక్రయాలకు తొలి తప్పిదంపై రూ.25 లక్షల జరిమానా, రెండోసారి లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం కల్పించారు.

#APNewLiquorPolicy #APLiquorPolicy #APExcisePolicy #AndhraPradesh #APLiqourShops #3736LiquorShops #APExcise #LiquorShopRenewal #APAlcoholPolicy #ExcisePolicy2026 #DigitalMonitoring #AICCTV #LiquorLicense #APGovernment #APNews