Home AP ఉద్యోగుల బకాయిలపై జేఏసీ సమరశంఖం చర్చలు కాదు.. తక్షణ నిర్ణయాలు కావాలి

ఉద్యోగుల బకాయిలపై జేఏసీ సమరశంఖం చర్చలు కాదు.. తక్షణ నిర్ణయాలు కావాలి



ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇకపై కాలయాపన చేయకుండా వెంటనే నిర్ణయాలు ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. విజయవాడ రెవెన్యూ భవన్‌లో శనివారం జరిగిన ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం నేతలు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు కొత్త డిమాండ్లు లేవని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నామని స్పష్టం చేశారు.

ఉద్యోగుల ఖర్చుపై వాస్తవ లెక్కలు చెప్పాలి

జూలై 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చించినా ఇప్పటివరకు ఒక్క నిర్ణయం కూడా ప్రకటించలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. చర్చల తర్వాత సానుకూల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలని కోరారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే రాష్ట్ర ఆదాయం మొత్తం ఖర్చవుతోందన్న ప్రచారంపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగ్‌ గణాంకాల ప్రకారం 2025–26లో మొత్తం రెవెన్యూ ఖర్చులో ఉద్యోగులు, పెన్షనర్లకు వెచ్చిస్తున్న మొత్తం 37.41 శాతమేనని తెలిపారు. మొత్తం రెవెన్యూ ఆదాయంలో ఈ ఖర్చు 47.64 శాతం, స్టేట్‌ ట్యాక్స్‌ రెవెన్యూలో సుమారు 59.36 శాతంగా ఉందని పేర్కొన్నారు.

బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి

ఐదు డీఏలు, మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషనర్ నియామకం, అదనపు పింఛను పునరుద్ధరణ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ కార్డు వంటి అంశాలపై శ్వేతపత్రంలో స్పష్టత లేదని జేఏసీ ప్రశ్నించింది. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ వంటి మొత్తాలను చెల్లించడం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపింది. బకాయిల వివరాలను ఉద్యోగుల పే స్లిప్‌లలో స్పష్టంగా చూపించాలని డిమాండ్ చేసింది. వెంటనే పీఆర్సీ కమిషనర్‌ను నియమించి ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని జేఏసీ కోరింది. సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది. పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ పింఛను పునరుద్ధరణ, పెన్షన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరింది.

ఆగస్టు 15 తర్వాత ఉద్యమం తప్పదని హెచ్చరిక

2024 నుంచి 2026 వరకు 41,321 మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారని బొప్పరాజు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో కూడా ఏటా సుమారు 14 నుంచి 15 వేల మంది రిటైర్‌ కానున్నారని చెప్పారు. దీంతో భవిష్యత్‌లో జీతభత్యాలపై ప్రభుత్వ వ్యయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుత బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వకపోతే ఆగస్టు 15 తర్వాత కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలతో ఐక్య కార్యాచరణ చేపడతామని ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. చర్చల్లో ఇచ్చిన హామీలపై తక్షణ నిర్ణయాలు ప్రకటించాలని నేతలు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగితే ఉద్యమం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

 

#APEmployees #APJAC #APJACAmaravati #EmployeesDues #PendingDues #AndhraPradeshEmployees #GovernmentEmployees #DAArrears #FiveDA #PRC #PRCCommissioner #InterimRelief #GPF #APGLI #MedicalReimbursement #Pensioners #CPS #GPS #EmployeeHealthCards #APGovernment #EmployeeProtest #APEmployeesAgitation #BopparajuVenkateswarlu #AndhraPradeshPolitics