Home National_news డీలిమిటేషన్‌ సవాళ్లు 2027 జనాభా లెక్కల తర్వాతే సీట్ల లెక్క

డీలిమిటేషన్‌ సవాళ్లు 2027 జనాభా లెక్కల తర్వాతే సీట్ల లెక్క


రాజ్యాంగ సవరణ లేకపోయినా ప్రక్రియ.
ఏం జరగబోతుందన్నదానిపై ట్విస్ట్ .

డీలిమిటేషన్‌పై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ వేడెక్కుతున్న వేళ అసలు ప్రశ్న.. రాజ్యాంగ సవరణ జరగకపోతే ఏం జరుగుతుంది? ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా కొత్త సవరణ చేయకపోయినా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిగా ఆపలేరు. 2027 జనాభా లెక్కల వివరాలు వెలువడిన తర్వాత కొత్త డీలిమిటేషన్‌కు మార్గం సుగమం అవుతుంది. రాజ్యాంగంలోని 81, 82 అధికరణాలు దీనికి సంబంధించిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

2029 ఎన్నికలకు ముందే పూర్తవుతుందా?

2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల రాష్ట్రాల వారీ పంపిణీ 1971 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతోంది. 2027 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు రావచ్చు. ముందుగా రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల పంపిణీపై నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ప్రతి రాష్ట్రంలోని నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్ణయిస్తారు. 2027 జనాభా లెక్కల తర్వాత ప్రారంభమయ్యే డీలిమిటేషన్ ప్రక్రియ 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే పూర్తవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. గతంలో డీలిమిటేషన్‌కు సంవత్సరాల సమయం పట్టింది. 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ సిఫారసులు 2008లో అమల్లోకి వచ్చాయి. 2009 లోక్‌సభ ఎన్నికలు కొత్త నియోజకవర్గాల ఆధారంగా జరిగాయి. ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతున్నందున ప్రక్రియ వేగంగా జరిగే అవకాశం ఉన్నా.. గడువు కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది.

దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయా? మహిళలకు 33% ?

కొత్త జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాలు పంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. లోక్‌సభ మొత్తం బలం కూడా పెరిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల్లో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రతి రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లోనూ మూడో వంతు మహిళలకు రిజర్వ్ చేసే విధానం అమల్లోకి రావచ్చు. అంటే డీలిమిటేషన్‌ కేవలం సీట్ల సరిహద్దుల మార్పు మాత్రమే కాదు.. మహిళా రాజకీయ ప్రాతినిధ్యంపై కూడా భారీ ప్రభావం చూపనుంది.

జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు చిక్కు

డీలిమిటేషన్‌ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్న మరో అంశం ‘ఒక వ్యక్తి.. ఒక ఓటు.. ఒకే విలువ’. ప్రస్తుతం దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఒకేలా లేదు. కేరళలో ఒక ఎంపీ సుమారు 14 లక్షల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఈ సంఖ్య సుమారు 19 లక్షల వరకు ఉంది. జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గతంలో సీట్ల పునర్విభజనను నిలిపివేశారు. 1976, 2001లో తీసుకున్న నిర్ణయాల కారణంగా జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం రక్షించబడింది. కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గితే.. తాము చేసిన కృషికే శిక్ష పడినట్లవుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదే ఇప్పుడు డీలిమిటేషన్‌ చర్చలో అతిపెద్ద రాజకీయ అంశంగా మారింది.

సరిహద్దులు ఎలా గీస్తారన్నదీ కీలకమే

డీలిమిటేషన్‌లో కేవలం సీట్ల సంఖ్య మారడం మాత్రమే కాదు.. నియోజకవర్గాల సరిహద్దులు ఎలా నిర్ణయిస్తారన్నది కూడా చాలా ముఖ్యం. ఒకే సంఖ్యలో ఓటర్లు ఉన్నా.. వారిని ఏ ప్రాంతాలతో కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారన్నదానిపై ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని గెర్రీమాండరింగ్ అనే పదంతో వివరిస్తారు. ఒక పార్టీకి ఉన్న ఓటర్లను అనేక నియోజకవర్గాల్లో పలుచగా విభజిస్తే.. ఆ పార్టీకి సీట్లు గెలిచే అవకాశం తగ్గుతుంది. దీనిని ‘క్రాకింగ్’ అంటారు. మరోవైపు ఒక పార్టీ ఓటర్లను కొన్ని నియోజకవర్గాల్లో భారీగా కేంద్రీకరిస్తే.. అక్కడ భారీ మెజారిటీ వచ్చినా మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ బలహీనపడొచ్చు. దీనిని ‘ప్యాకింగ్’ అంటారు. అందుకే నియోజకవర్గాల సరిహద్దుల రూపకల్పనలో పారదర్శకత అత్యంత కీలకం.

డీలిమిటేషన్‌ అసలు పోరాటం ఇదే

డీలిమిటేషన్‌ అంటే కేవలం లోక్‌సభ సీట్ల సంఖ్యను మార్చడం కాదు. ఇది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ఓటు విలువ, మహిళా రిజర్వేషన్, సమాఖ్య వ్యవస్థ, నియోజకవర్గాల భవిష్యత్తును మార్చే కీలక ప్రక్రియ. రాజ్యాంగ సవరణ లేకపోయినా 2027 జనాభా లెక్కల తర్వాత ప్రస్తుత నిబంధనల ప్రకారం డీలిమిటేషన్‌కు అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మొదలైన చర్చ రేపటి భారత రాజకీయ పటాన్ని నిర్ణయించేంత కీలకం. ఎక్కడ సీట్లు పెరుగుతాయి? ఎక్కడ తగ్గుతాయి? ఎవరి రాజకీయ బలం పెరుగుతుంది? ఎవరి ప్రాతినిధ్యం తగ్గుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం డీలిమిటేషన్‌ గీతల్లోనే దాగి ఉంది. అందుకే ఇది కేవలం నియోజకవర్గాల సరిహద్దుల మార్పు కాదు.. భారత ప్రజాస్వామ్యంలో రేపటి అధికార సమీకరణాలను నిర్ణయించే అసలైన రాజకీయ పోరాటం!

 

#Delimitation #Delimitation2027 #IndiaDelimitation #Census2027 #LokSabha #LokSabhaSeats #DelimitationCommission #DelimitationDebate #2029Elections #SouthIndia #NorthIndia #SouthernStates #WomenReservation #WomenQuota #Article81 #Article82 #OnePersonOneVote #Gerrymandering #PoliticalRepresentation #IndianPolitics #LokSabhaElections #Constitution #Federalism #IndiaPolitics