సేవే శ్వాసగా.. సమాజమే కుటుంబంగా
దేవాంగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
దేవాంగుల ఆప్తుడు కన్నుమూత
దేవాంగుల ఆప్తుడు, హైదరాబాద్ దేవాంగ సంక్షేమ సంఘం సీనియర్ సేవకుడు నాసక నాగేశ్వరరావు (66) శివైక్యం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దేవాంగ సమాజం ఒక నిస్వార్థ సేవకుడిని కోల్పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, సంఘం బాధ్యులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 1990ల నుంచే హైదరాబాద్ దేవాంగ సంక్షేమ సంఘం కార్యక్రమాల్లో నాగేశ్వరరావు చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా కోశాధికారిగా సుమారు 35 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. సంఘం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఆయన పాత్ర ప్రత్యేకంగా నిలిచేది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, సంస్థపై నమ్మకాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

ఉద్యోగంతో పాటు సమాజ సేవ
ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించిన నాగేశ్వరరావు.. అదే సమయంలో దేవాంగ సంస్థ కోసం అహర్నిశలు శ్రమించారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సమాజ సేవకు మాత్రం సమయం కేటాయించారు. విమర్శలు ఎదురైనా, ప్రశంసలు వచ్చినా ఒకే విధంగా తన కర్తవ్యాన్ని కొనసాగించడం ఆయన వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం. కోశాధికారి బాధ్యత సాధారణమైనది కాదు. నమ్మకం, నిజాయితీ, ఓర్పు, సహనం ఎంతో అవసరం. అలాంటి కత్తి మీద సాములాంటి బాధ్యతను నాగేశ్వరరావు దశాబ్దాల పాటు విసుగు లేకుండా నిర్వర్తించారు. సంస్థ కార్యక్రమాల కోసం ఇతర రాష్ట్రాలు, నగరాల్లో పర్యటిస్తూ దేవాంగ సమాజాన్ని కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు ప్రత్యేకత కేవలం పదవిలోనే కాదు.. ఆయన మనసులోనూ కనిపించేది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్వభావం ఆయనది. చిన్నవారిని ఆప్యాయంగా పలకరిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, సంఘ సభ్యులతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. అందుకే ఆయనకు దేవాంగ సమాజంలో ఆప్తుడిగా ప్రత్యేక స్థానం ఏర్పడింది.
కర్మయోగిలా సాగిన జీవితం
పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. కానీ వెళ్లిపోయిన తర్వాత కూడా సమాజం గుర్తుంచుకునే జీవితం కొందరికే దక్కుతుంది. పేరు, ప్రతిష్ఠ, ఆస్తుల కోసం కాకుండా తన కర్తవ్యాన్ని నమ్ముకుని జీవించిన నాగేశ్వరరావు అలాంటి అరుదైన వ్యక్తి. కుటుంబ బాధ్యతలతో పాటు దేవాంగ సమాజానికి చేసిన సేవ ఆయన జీవితాన్ని ధన్యజీవితంగా నిలిపింది. నాగేశ్వరరావు భౌతికంగా దూరమైనా.. ఆయన అందించిన సేవలు, సంఘం కోసం చేసిన కృషి, అందరితో కలిసిమెలిసి నడిచిన తీరు దేవాంగుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒక వ్యక్తి వెళ్లిపోయాడు.. కానీ ఒక సేవా స్ఫూర్తిని సమాజానికి అందించి వెళ్లారు. నిస్వార్థంగా బతికిన ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని దేవాంగ సమాజం ఆకాంక్షిస్తోంది.











