Home National_news లడఖ్‌ భారత్‌లో అంతర్భాగం

లడఖ్‌ భారత్‌లో అంతర్భాగం

హక్కుల విషయంలో వెనక్కి తగ్గం.
సరిహద్దు పేర్లపై డ్రాగన్‌ అభ్యంతరాలు.
చైనాకు భారత్‌ స్పష్టమైన సమాధానం!

లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని తేల్చిచెప్పింది. లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలకు భారత్‌ ప్రామాణిక పేర్లు కేటాయించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. అక్టోబర్‌ 13న బీజింగ్‌లో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌.. భారత్‌ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిందని ఆరోపించారు. తమ దేశం లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాన్ని గుర్తించదని ప్రకటించారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌.. లడఖ్‌ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమని స్పష్టం చేశారు. చైనా నిరాకరణ వల్ల ఈ వాస్తవాన్ని మార్చలేరని పేర్కొన్నారు.

28 ప్రాంతాలకు ప్రామాణిక పేర్లు

లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలకు అక్టోబర్‌ 2న భారత్‌ అధికారికంగా ప్రామాణిక పేర్లు కేటాయించింది. సర్వే ఆఫ్‌ ఇండియా అధికారిక మ్యాప్‌లో ఈ పేర్లను నమోదు చేసింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గతంలో భారత్‌-చైనా మధ్య ఘర్షణలు, ప్రతిష్టంభన చోటుచేసుకున్న గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌ వంటి కీలక ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రాంతాల గుర్తింపులో స్పష్టత తీసుకురావడం, వాటి వివరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం పాలనా యంత్రాంగం, స్థానిక భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం పేర్లను ఖరారు చేసినట్లు వెల్లడించారు.

సరిహద్దులపై భారత్‌ వైఖరి స్పష్టం

చైనా అభ్యంతరాలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది. ప్రాంతాల అధికారిక గుర్తింపు, భౌగోళిక వివరాల నమోదులో భారత్‌ తన విధానాన్ని కొనసాగిస్తుందని ఈ ప్రకటన ద్వారా స్పష్టమైంది. మరోవైపు, లడఖ్‌పై తమ వాదనను చైనా పునరుద్ఘాటించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల పేర్లు, వాటి గుర్తింపుపై ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే లడఖ్‌ భారత్‌లో అంతర్భాగమనే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది.

#Ladakh #IndiaChinaRelations #IndiaChinaBorder #LAC #LadakhDispute #IndianForeignMinistry #RandhirJaiswal #China #BorderTensions #Geopolitics #NationalSecurity #IndiaNews