అభివృద్ధి పనులకు శ్రీకారం
కరీంనగర్లో కలెక్టరేట్ ప్రారంభం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. పలు శాఖల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారుల నుంచి వివరాలు తీసుకోనున్నారు. కరీంనగర్ కార్యక్రమాలు పూర్తయ్యాక సాయంత్రం సిరిసిల్లకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు.
ర్యాలీగా సభా ప్రాంగణానికి సీఎం
సిరిసిల్ల చేరుకున్న అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు రేవంత్రెడ్డి ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను సీఎం ప్రజలకు వివరించే అవకాశం ఉంది.











