18న సద్దుల బతుకమ్మ వైభవం.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయంలో శనివారం సీఎస్ సంజయ్ జాజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలతో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక కేంద్రం నుంచి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. వందలాది మంది కళాకారులు కూడా తమ కళారూపాలతో ర్యాలీలో పాల్గొంటారు. ప్రత్యేక వేదికపై జరిగే వేడుకలకు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
ట్రాఫిక్ నుంచి నిమజ్జనం వరకు
బతుకమ్మ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మల ఏర్పాటు, విద్యుత్ దీపాలతో అలంకరణ చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్‌కు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చిల్డ్రన్స్ పార్క్ బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లు చేయాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు కొనసాగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్లు, బారికేడింగ్, లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పండగ శోభ
బతుకమ్మ పది రోజుల పాటు రవీంద్రభారతిలోనూ వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ సంబరాలను ప్రతిబింబించే ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నట్లు సంజయ్ జాజు తెలిపారు. డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంశాన్ని కూడా లోగోలో ప్రతిబింబించనున్నారు. వేడుకల ఏర్పాట్ల సమీక్షలో పర్యాటక, సాంస్కృతిక శాఖ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











