Home Political_News కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్ చేస్తోందేంటి?

కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్ చేస్తోందేంటి?

6

అబద్ధపు హామీలు ఇచ్చి, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వంద రోజుల్లో పిల్లలు పుడతారా అంటూ వింత సమాధానాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ను తిట్టడమే సీఎం పని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్‌ను తిట్టడమే నిత్యకృత్యంగా మారిందని, పాలనపై కనీస శ్రద్ధ లేదని కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్లు కట్ చేయడానికి సీఎం ఎప్పుడూ జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే పెరిగాయని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించని ఈ ప్రభుత్వం, ‘హైడ్రా’ పేరుతో ఉన్న ఇళ్లను నిర్దాక్షీణ్యంగా కూలుస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగం
తెలంగాణలో కాంగ్రెస్ పాలన కారణంగా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి కనీసం గోనెసంచులు కూడా లేని స్థితికి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. రైతులకు అందాల్సిన ‘రైతుబంధు’ పెట్టుబడి సాయాన్ని పూర్తిగా బంద్ చేశారని ఆరోపించారు. ఆ పైసలన్నీ ఢిల్లీకి తరలిపోతున్నాయని, రాహుల్ గాంధీ ఖాతాల్లో పడుతున్నాయని దుయ్యబట్టారు. ధాన్యం అమ్ముడుపోక అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపైనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలంతా కథానాయకులు కావాలి
ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల తీరు దండుపాళ్యం ముఠాను తలపిస్తోందని, ఈ ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడుపుతోందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలోని మంచి, చెడులను ప్రజలు పూర్తిగా గమనించారని చెప్పారు. తెలంగాణను మళ్లీ ప్రగతి పథంలో నడపాలంటే కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, అందుకోసం ప్రజలంతా కథానాయకులుగా మారి పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 

#KTR #BRS #KCR #TelanganaPolitics #RevanthReddy #CongressGovernment #BRSWorkingPresident #Malkajgiri #PoliticalMeeting #TelanganaNews #PoliticalNews #ElectionPromises #CongressGuarantees #FarmersIssues #RythuBandhu #Hyderabad #HydraDemolitions #RahulGandhi #TelanganaFarmers #OppositionVoice #TRS #BharatRashtraSamithi #PoliticalSpeech #BreakingNews #LatestNews #StatePolitics #PublicMeeting #KTRSpeech #TelanganaDevelopment #PoliticalControversy