Home Telangana ఇక అన్‌స్టాపబుల్ హైదరాబాద్ మొత్తం తిరిగేయండి

ఇక అన్‌స్టాపబుల్ హైదరాబాద్ మొత్తం తిరిగేయండి

అందుబాటులోకి కామన్ పాస్ విధానం
మెట్రో–ఆర్టీసీ అనుసంధానం అమల్లోకి

హైదరాబాద్‌ ప్రజా రవాణాను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ విధానాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు. బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, అజారుద్దీన్‌, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి కామన్‌ పాస్‌ వినియోగం, మెట్రో నుంచి బస్సుకు మారే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రయాణ సౌకర్యంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒకే పాస్‌తో రెండు రవాణా సేవలను వినియోగించుకోవడం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతోందని ప్రయాణికులు తెలిపారు.

బస్సులోనూ ప్రయాణికుల అభిప్రాయాలు

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి సచివాలయం వరకు భట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మెట్రో నుంచి దిగిన తర్వాత గమ్యస్థానానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉండటం ప్రయాణాన్ని సులభతరం చేస్తోందని ప్రయాణికులు వివరించారు. మరో టికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం వల్ల సౌకర్యంగా ఉందన్నారు. కామన్‌ పాస్‌ విధానం ద్వారా ప్రజా రవాణాలోని వివిధ మార్గాలను అనుసంధానం చేసి సీమ్‌లెస్‌ ప్రయాణ అనుభూతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. భవిష్యత్తులో ఆటోలు, ఊబర్‌ వంటి ఇతర రవాణా సేవలను కూడా అనుసంధానించే దిశగా ఆలోచిస్తున్నామని చెప్పారు.

ప్రజా రవాణా బలోపేతమే లక్ష్యం

రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలు వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు సమయం, శ్రమ, ఖర్చు తగ్గుతాయని తెలిపారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు ప్రజా రవాణాను బలోపేతం చేయడం ముఖ్యమైన పరిష్కారమని పేర్కొన్నారు. డైలీ పాస్‌, మంత్లీ పాస్‌తో పాటు కామన్‌ పాస్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా సేవలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, ఎన్‌వీఎస్‌ రెడ్డి, మెట్రో ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

#HyderabadMetro #TSRTC #CommonPass #MetroRTC #HyderabadPublicTransport #BhattiVikramarka #PonnamPrabhakar #HyderabadMetroPass #CommonTravelPass #DailyPass #MonthlyPass #TelanganaGovernment #PublicTransport #HyderabadTraffic #SeamlessTravel