మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, జిల్లాలో సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ కింద 1.33 లక్షల రైతు కుటుంబాలకు రూ.252.94 కోట్ల పెట్టుబడి సాయం అందించామని, ఆధునిక సాగు కోసం 29 కిసాన్ డ్రోన్లను సబ్సిడీపై పంపిణీ చేశామని వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూనే, మత్స్యకారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, మెగా డీఎస్సీ ద్వారా జిల్లాలో 1,203 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని మంత్రి పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ ద్వారా 1.98 లక్షల మంది విద్యార్థులకు, ఎన్టీఆర్ భరోసా ద్వారా ప్రతి నెలా 2.30 లక్షల మందికి పెన్షన్ ప్రయోజనాలు అందిస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని సుభాష్ ధీమా వ్యక్తం చేశారు.










