బ్రాహ్మణి చేతుల మీదుగా డబ్ల్యూఏపీఎల్ షురూ.
మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్ ఘనంగా ప్రారంభమైంది. మహిళా యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారిని ఉమెన్ ప్రీమియర్ లీగ్, భారత మహిళా క్రికెట్ జట్టుకు చేరువ చేయడమే ఈ టోర్నీ లక్ష్యం. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరై డబ్ల్యూఏపీఎల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. డబ్ల్యూఏపీఎల్‌కు మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మహిళా క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ లీగ్ మంచి వేదికగా నిలుస్తుందని బ్రాహ్మణి అన్నారు. అవకాశం లభిస్తే మహిళా క్రీడాకారిణులు అద్భుతంగా రాణించగలరని పేర్కొన్నారు.
నాలుగు జట్లు.. ఏడు రోజుల్లో 13 మ్యాచ్‌లు
ఫ్రాంచైజీ విధానంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న డబ్ల్యూఏపీఎల్‌లో రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ పోటీపడుతున్నాయి. ఏసీఏ స్టేడియంలో ఏడు రోజుల పాటు మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. శనివారం రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అనంతరం అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడ్డాయి. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్‌బాబు, మిథాలీ రాజ్ సహా పలువురు క్రికెట్ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
#WAPL #WomensAndhraPremierLeague #WomensCricket #NaraBrahmani #MithaliRaj #Mangalagiri #ACAStadium #AndhraCricket #WomenCricketers #WPL #IndianWomensCricket #RayalaseemaGenStars #GodavariEagles #AmaravatiEChampions #VizagFireBirds











