Home General వాడపల్లి వెంవకన్నకు కానుకల వర్షం – 34 రోజుల్లో రూ.2.44 కోట్ల ఆదాయం

వాడపల్లి వెంవకన్నకు కానుకల వర్షం – 34 రోజుల్లో రూ.2.44 కోట్ల ఆదాయం

51

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు కానుకల వర్షం కురిపించారు. గత 34 రోజులకు గాను ఆలయ హుండీల లెక్కింపును దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. ప్రధాన ఆలయాలతో పాటు అన్నప్రసాదం హుండీల ద్వారా మొత్తం రూ.2,44,37,050 నగదు ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు భక్తులు స్వామివారికి 52 గ్రాముల బంగారం, 1.588 కిలోల వెండిని కానుకలుగా సమర్పించారు.
స్వామివారి దర్శనానికి దేశ, విదేశాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లను కూడా గుర్తించారు. ఈ పారదర్శక లెక్కింపు కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఈఓ గ్రేడ్-3 నరేంద్రకుమార్, కెనరా బ్యాంకు ప్రతినిధులు, శ్రీవారి సేవకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.