Home AP మళ్లీ చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా

మళ్లీ చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా

నియోజకవర్గంపై బొత్స ఫుల్ క్లారిటీ.
బొత్స 2.0కు తిరుగులేదన్న అనూష.

చీపురుపల్లిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల సమావేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 2029 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గౌరవప్రదమైన రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, లాలూచీ రాజకీయాలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తాను మంత్రిగా ఉన్నా నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను మంత్రిగానే భావించానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిన నేపథ్యంలో చీపురుపల్లి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

బొత్స 2.0పై అనూష కీలక వ్యాఖ్యలు

బొత్స కుమార్తె, వైఎస్సార్‌సీపీ నేత బొత్స అనూష మాట్లాడుతూ “ఇప్పటివరకు బొత్స 1.0 చూశారు.. ఇక బొత్స 2.0 చూస్తారు” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా వ్యాఖ్యానించారు. చిన్న శ్రీను కోసం గతంలో ఎదురుచూసిన పరిస్థితి మారిందని, ఇప్పుడు తాను, తన తమ్ముడు, తండ్రి కలిసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. పార్టీ మారిన వారికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. చీపురుపల్లి కార్యకర్తల వల్లే తమ కుటుంబానికి రాజకీయ గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలను నివారించాలన్న జగన్‌ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త కష్టపడాలని కోరారు. ఇదే సమయంలో భీమిలి సమగ్రాభివృద్ధి, ప్రతి గడపకు సంక్షేమం లక్ష్యంగా జగన్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తామని అనూష పేర్కొన్నారు.

#BotsaSatyanarayana #BotsaAnusha #Botsa20 #Cheepurupalli #YSRCP #YSJagan #MajjiSrinivasaRao #ChinnaSrinu #TDP #VizianagaramPolitics #AndhraPradeshPolitics #2029Elections #BotsaFamily #YSRCPPolitics #APPolitics