రాజధాని నిర్మాణానికి సీఎం దిశానిర్దేశం.
ప్రజా రవాణాపై చంద్రబాబు ఫోకస్.
రూ.1,548 కోట్లతో టెండర్లకు ఆమోదం.
అమరావతి రాజధాని అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. విజయవాడ, గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు సరిపోయే మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. రాజధానిలో నూతన అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్, లిఫ్ట్‌ల నిర్మాణానికి రూ.661 కోట్లతో ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే అసెంబ్లీ భవనంలో వ్యూపాయింట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
రైతులకు యాన్యుటీ.. మౌలిక వసతులకు భారీ నిధులు
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదించింది. హోటళ్లు, పాఠశాలలకు భూముల కేటాయింపుపై మంత్రుల కమిటీ సిఫార్సులకు కూడా ఆమోదం లభించింది. రెండో దశ భూసమీకరణలో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు యాన్యుటీ చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో 50 శాతం సస్టెయినబుల్ గ్రీన్ కవర్ లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు. కొండలు, నీటి వనరులను పర్యాటక ఆకర్షణలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బ్లూప్రింట్ రూపొందించాలని ఆదేశించారు.
ప్రపంచస్థాయి గుర్తింపే అమరావతి లక్ష్యం
అమరావతి పేరును దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. బ్లూ-గ్రీన్, డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ స్తంభాలు లేని నగరం వంటి అంశాలను ప్రధాన థీమ్‌లుగా తీసుకుని నగర బ్రాండింగ్ చేయాలని చెప్పారు. ప్రతి పౌరుడు ‘ఇది నా నగరం’ అని భావించేలా అమరావతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్ రెవెన్యూ మోడళ్లపై కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని ఆదేశించారు. విజయవాడ–గుంటూరు–మంగళగిరి–తాడేపల్లి ప్రాంతాలను కలుపుకుని అమరావతి మెగా సిటీగా ఎదుగుతుందని, భవిష్యత్తులో స్వయం ఆర్థిక వనరులతో నడిచే నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు.
#Amaravati #AmaravatiDevelopment #ChandrababuNaidu #CRDA #AmaravatiCapital #MassTransport #AmaravatiInfrastructure #AndhraPradesh #APCapital #Vijayawada #Guntur #Mangalagiri #AmaravatiMegaCity #UrbanDevelopment #APDevelopment











