30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం.
700 ఎకరాలపై లెక్క తేల్చాలన్న సీఎం.
తెలంగాణ అసెంబ్లీలో 22ఏ భూములపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఫాంహౌస్ పరిధిలో మొత్తం ఎంత భూమి ఉంది, ఆ భూముల యాజమాన్య హక్కులు ఎవరి పేర్లలో ఉన్నాయి, ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా అనే అంశాలను పూర్తిగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఫాంహౌస్ సుమారు 700 ఎకరాల పరిధిలో ఉందన్న అంశాన్ని కూడా విచారణలో తేల్చాలని సీఎం సూచించారు. 30 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.
388 ఎకరాలు ప్రభుత్వ భూమేనా?
ఫాంహౌస్ పరిధిలో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న ఆరోపణలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి సభలో ప్రస్తావించారు. ఆ భూమి ప్రభుత్వానిదిగా విచారణలో తేలితే దాన్ని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. భూముల హక్కులు, రికార్డులు, గతంలో జరిగిన బదిలీలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. విచారణలో తప్పులు తేలితే సంబంధిత భూములపై ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఈ అంశంపై అధికారులకు స్పష్టమైన గడువు విధించడం అసెంబ్లీలో చర్చకు ప్రధాన కారణంగా మారింది.
కుటుంబ భూములపైనా లెక్కలు
కేసీఆర్ కుటుంబానికి చెందిన భూముల వివరాలను కూడా రేవంత్‌రెడ్డి సభలో ప్రస్తావించారు. సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబానికి 67.5 ఎకరాలు, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తొమ్మిది జిల్లాల పరిధిలో 24 మండలాల్లో కల్వకుంట్ల కుటుంబానికి మొత్తం 439 ఎకరాల భూమి ఉందని సీఎం తెలిపారు. ఈ భూములపై కూడా రికార్డులను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫాంహౌస్ భూములపై వచ్చే 30 రోజుల్లో నివేదికతో అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.
#RevanthReddy #KCR #ErravelliFarmhouse #KCRFarmhouse #LandProbe #TelanganaLandRow #TelanganaAssembly #GovernmentLand #LandInquiry #KCRLandRecords #Erravelli #TelanganaPolitics #RevenueDepartment #LandDispute











