ఆధిపత్య కుల రాజకీయ పెత్తనానికి బీసీ నేతల అభ్యంతరం!
బీసీల హక్కుల కోసం పోరాడాల్సిన వేదికలే రాజకీయ వివాదాలకు కేంద్రాలవుతున్నాయా? బీసీ ఉద్యమాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? హైదరాబాద్లో జరిగిన ఓబీసీ నాయకుల సమావేశం ఈ ప్రశ్నలకు తావిస్తోంది. కవితకు చెందిన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు సమావేశ ఖర్చులు భరిస్తున్నారన్న ప్రకటనపై బీసీ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఉద్యమానికి రాజకీయ పార్టీల స్పాన్సర్షిప్ ఎందుకంటూ ప్రశ్నిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. ఇలా ఐతే ఉద్యమ లక్ష్యాలు ఎలా నెరవేరుతాయన్న ప్రశ్నలు లేవనెత్తారు. బీసీల ఆత్మగౌరవం, కులగణన, జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం వంటి కీలక అంశాలపై పోరాటం సాగించాల్సిన సమయంలో ఆధిపత్య కులల వారు ఎందుకని నిలదీశారు. ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం బీసీలకు లేదని నేతలు స్పష్టం చేశారు. బీసీలను విస్మరించి ఏ నాయకుడూ, ఏ రాజకీయ శక్తీ ముందుకెళ్లలేదని హెచ్చరించారు. బీసీలంతా ఐక్యంగా ఉంటేనే రాజకీయంగా బలపడతారని, హక్కులు సాధించగలరని నేతలు స్పష్టం చేశారు
కులగణన సమన్వయ సమావేశంలో రచ్చ రచ్చ
బీసీల హక్కుల కోసం జరిగే ఉద్యమం ఎవరి చేతుల్లో ఉండాలి? బీసీల నాయకత్వంలోనా.. రాజకీయ పార్టీల స్పాన్సర్షిప్లోనా? హైదరాబాద్లో జరిగిన ఓబీసీ నాయకుల సమావేశం ఈ ప్రశ్నను తెరపైకి తెచ్చింది. కవితకు చెందిన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు సమావేశ ఖర్చులు భరిస్తున్నారని ప్రకటించడంతో పలువురు బీసీ సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ ఉద్యమాన్ని బీసీలే స్వతంత్రంగా నడపాలన్న స్పష్టమైన వైఖరితో సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. బీసీల సామాజిక, రాజకీయ హక్కుల కోసం చిత్తశుద్ధితో కృషి చేయని రాజకీయ శక్తులు ఇప్పుడు బీసీ మంత్రం జపిస్తూ న్నారని విమర్శించారు. జాతీయ బీసీ కులగణన కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నాగ్పూర్ సమావేశం కొనసాగింపుగా హైదరాబాద్లోని తాజ్ దక్కన్ హోటల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఉదయం సుమారు 11.30 గంటలకు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తానే సమావేశానికి స్పాన్సర్ చేసినట్లు ప్రకటించక ముందే.. సమావేశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీసీ నాయకులు బయటకు వెళ్లిపోయారు. బీసీల ఉద్యమాన్ని తమ నిర్ణయాలతో నడపాల్సిన చోట ఒంటెద్దు పోకడలు ఎందుకన్న ప్రశ్నలు నాయకుల నుంచి వినిపించాయి. బీసీలను కలుపుకోకుండా, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ముందుకెళ్తే ఉద్యమ లక్ష్యాలు సాధించడం కష్టమని వారు స్పష్టం చేశారు.

హక్కుల పోరాటానికి రాజకీయ రంగు వద్దు
బీసీ కులగణన, జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం, ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు కోడ్ వంటి అంశాలు బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినవని నాయకులు పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం నిర్వహించే సమావేశాలు ఏ రాజకీయ పార్టీకి ప్రచార వేదికలుగా మారకూడదని స్పష్టం చేశారు. ఎవరి అండదండలపైనా ఆధారపడకుండా, బీసీలు తమ హక్కుల కోసం తామే పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ స్పాన్సర్షిప్ ఉద్యమ స్వతంత్రతను దెబ్బతీసే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజకీయంగా బలపడతారని, ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం లేదని తమ వైఖరిని వెల్లడించారు.
కులగణన కోసం ఐక్య పోరాటం
నాగ్పూర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఓబీసీ కులగణనలో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయడం, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించడం, ఎస్సీ, ఎస్టీల తరహాలో ఓబీసీ కులగణన నిర్వహించడం ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఈ లక్ష్యాల సాధన కోసం ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు. సమావేశ బహిష్కరణలో బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్, బీసీఎఫ్ కన్వీనర్ చెన్న రాములు ముదిరాజ్, రమణ, మేకల కృష్ణతో పాటు మెట్టు సూర్యప్రకాష్, చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, కొండల్ గౌడ్, లింగేష్ యాదవ్, దశరథ్ నేత, రాంబాబు, రాజు, దుర్గయ్య గౌడ్, బైరి శేఖర్, సింగం నగేష్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ అండకంటే బీసీల ఐక్యతే ముఖ్యమన్న సందేశంతో ఈ పరిణామం బీసీ ఉద్యమంలో కొత్త చర్చకు దారితీసింది.











