Home Telangana విద్యా, వైద్యంపై సీఎం ఫోకస్

విద్యా, వైద్యంపై సీఎం ఫోకస్

ఆసుపత్రులు, స్కూళ్లపై నజర్ .
నిర్మాణాలు సరే, సేవలు ముఖ్యం.

రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శనివారం సీఎంవో అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్‌, అల్వాల్‌, వరంగల్‌, ఉస్మానియా ఆసుపత్రుల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే సమయానికి సిబ్బంది కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి, ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చే నాటికి అన్ని రకాల వైద్య సేవలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

క్షేత్ర పర్యటనలపై స్పష్టమైన ఆదేశాలు

జిల్లా కలెక్టర్లు, అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లు, ఆసుపత్రులను అధికారులు స్వయంగా పరిశీలించాలి అని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వీటి పరిస్థితిపై వారానికోసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇదే సమావేశంలో డిసెంబరులో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026 ఏర్పాట్లపై కూడా చర్చించారు. సమ్మిట్‌ నిర్వహణ, అతిథుల ఏర్పాట్లు, పెట్టుబడుల ఆకర్షణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. త్వరలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, సీఎస్‌ సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

#RevanthReddy, #TelanganaCM, #TelanganaGovernment, #Education, #Healthcare, #TelanganaHospitals, #OsmaniaHospital, #WarangalHospital, #LBnagarHospital, #AlwalHospital, #GovernmentSchools, #SchoolInfrastructure, #HospitalStaff, #TelanganaGlobalSummit2026