Home Telangana 22-ఎ భూములకు రిజిస్ట్రేషన్‌ దారి

22-ఎ భూములకు రిజిస్ట్రేషన్‌ దారి

నాలా రుసుముతో చిక్కులు తొలగింపు.

దశాబ్దాలుగా భూ యజమానులను వేధిస్తున్న 22-ఎ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములుగా పట్టాలు ఉండి, తర్వాత నివాస వినియోగంలోకి వచ్చినా నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూములకు ఇప్పుడు మార్గం సుగమమైంది. అర్హత ఉన్న భూములకు నాలా రుసుముతో పాటు అవసరమైన ప్రభుత్వ రుసుములు వసూలు చేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. మెమో నంబర్‌ 48062/ULC/A1/2026 ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

అర్హత పరిశీలన తర్వాతే రిజిస్ట్రేషన్‌

22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ నివాస వినియోగంలో ఉన్న పట్టా భూముల దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, భూమి హక్కులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులకు నాలా రుసుము, ఇతర ప్రభుత్వ రుసుములు వసూలు చేసి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రక్రియను పారదర్శకంగా, కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏళ్లుగా ప్లాట్లు విక్రయించుకోలేక, వాటిపై రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.

అధికారులపై నిరంతర పర్యవేక్షణ

22-ఎ సమస్యల పరిష్కారంపై జరిగిన సమీక్షలో మంత్రి పొంగులేటి, తాజా ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా నిరంతరం మానిటరింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన దరఖాస్తులను వేగంగా పరిష్కరించి అమలు పురోగతిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అధికారులు బాధ్యతగా అమలు చేస్తే భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలులో భాగంగానే ఈ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

22-ఎపై వరుసగా ఫాస్ట్‌ట్రాక్‌ చర్యలు

22-ఎకు సంబంధించిన 10 నుంచి 12 రకాల సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాసనసభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం జీఓ 118, జీఓ 76కు అనుగుణంగా మెమోలు జారీ చేశారు. 22-ఎలో ఉన్నా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ మున్సిపల్‌ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇప్పుడు నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూములకు కూడా రిజిస్ట్రేషన్‌ మార్గం తెరుచుకుంది.

 

#Telangana22ALands #22ALands #22ALandRegistration #NALACharges #TelanganaLandRegistration #PonguletiSrinivasReddy #RevanthReddy #TelanganaGovernment #RevenueDepartment #LandIssues #LandRegistration #TelanganaPolitics #GHMC #HMDA #DTCP