మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక స్వయంప్రకటిత దొంగ బాబా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళను దేవుడి పేరిట నమ్మించి చాన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్న రాధేశ్యామ్ మిశ్రా అలియాస్ రాధామోహన్ మిశ్రా అనే దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. పుణెలోని వాఘోలి ప్రాంతంలో గల ఉబాలే నగర్‌లో ఇతను ఒక ఆధునిక గురుకులం నడుపుతున్నాడు. తన మాయమాటలతో సదరు మహిళను కుటుంబానికి దూరం చేసి, భర్తతో విడాకులు తీసుకునేలా ఒత్తిడి తెచ్చాడు. తాను దేవుడి అవతారమంటూ నమ్మించి ఆమె చేత బలవంతంగా మూత్రం తాగించడం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డాడు.
చిత్రహింసలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన బాబా
బాధిత మహిళ 2010 లో ఈ దొంగ బాబా ఆశ్రమానికి పరిచయమైంది. ఆ సమయం నుంచి 2016 వరకు ఆమెను దారుణంగా లైంగికంగా వాడుకున్నాడు. శారీరకంగా తీవ్రంగా హింసించడమే కాకుండా కరెంట్ షాక్‌లు కూడా ఇచ్చాడు. మహిళకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన వీడియోలను రికార్డ్ చేసి, వాటిని చూపిస్తూ చాన్నాళ్లుగా బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ వచ్చాడు. తనకున్న శక్తులతో నాశనం చేస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురిచేశాడు. తన ఆశ్రమాన్ని ధనవంతం చేయడానికి సదరు మహిళ చేత పలు దొంగతనాలు కూడా చేయించాడు.
ఆశ్రమంలో క్షుణ్ణంగా పోలీసుల తనిఖీలు
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాబా ఆశ్రమంపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆశ్రమంలోని ఒక భూగర్భ గది నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలలో భాగంగా 12 ల్యాప్‌టాప్‌లు, 11 మొబైల్ ఫోన్లు, 19 హార్డ్ డిస్క్‌లు, అనేక పెన్ డ్రైవ్‌లు, పాత క్యాసెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 6.5 లక్షల నగదు, దాదాపు రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కనుగొన్నారు. ఆశ్రమంలో పెద్ద ఎత్తున మందు బిళ్లలు, డ్రగ్స్ నిల్వలు కూడా లభించడంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.
దొంగ బాబా అనుచరుల అరెస్ట్
ఈ దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడైన రాధేశ్యామ్ మిశ్రాతో పాటు అతనికి సహకరించిన అతని ముఖ్య అనుచరుడు ‘స్వామి’ కన్వల్ నయన్ సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ దొంగ బాబా చేతిలో ఇంకా చాలా మంది మహిళలు మోసపోయి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. నిందితులందరినీ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారికి శనివారం వరకు పోలీస్ కస్టడీ విధించింది.











