నేరగాళ్లకు అడ్డాగా మారిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ యాప్ ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదులు, డ్రగ్స్ విక్రయించే ముఠాలకు ఒక ‘కొత్త డార్క్ వెబ్’ లాగా మారిందని కేంద్రం పేర్కొంది. చట్టాల నుండి, దర్యాప్తు సంస్థల నుండి తప్పించుకోవడానికి నేరగాళ్లు ఈ వేదికను ప్రధాన అడ్డాగా మార్చుకున్నారని దుయ్యబట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు ఒక సమగ్రమైన అఫిడవిట్‌ను సమర్పించింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు కూడా ఈ యాప్ దుర్వినియోగంపై ఇటీవల ఫిర్యాదులు భారీగా పెరిగాయని కోర్టుకు వివరించింది.
తాత్కాలిక నిషేధం నేపథ్యం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం తర్వాత జూన్ 21న దేశంలో రీటెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ముఠాలు టెలిగ్రామ్ వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, ప్రశ్నపత్రాల లీకేజీని, మోసపూరిత నెట్‌వర్క్‌లను అరికట్టడానికి కేంద్రం ఇటీవల ఈ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. జూన్ 22 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కేంద్రం తెలిపింది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాజమాన్యం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈ కేసు విచారణలో భాగంగా కేంద్రం తన నివేదికను సమర్పించింది.
గుర్తింపును దాచే ఫీచర్లు
టెలిగ్రామ్‌లో ఉన్న అధునాతన ప్రైవసీ సెట్టింగ్‌ల వల్ల యూజర్లు తమ ఫోన్ నంబర్లు, ఐడీలు వంటి గుర్తింపు వివరాలను పూర్తిగా దాచిపెట్టే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అసలు వ్యక్తులను గుర్తించడం దర్యాప్తు అధికారులకు అత్యంత కష్టంగా మారుతోంది. ఈ లొసుగులను వాడుకుని నేరగాళ్లు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, ఉగ్రదాడుల ప్రణాళికలు వంటి ఘోరాలకు పాల్పడుతున్నారని తెలిపింది. హ్యాకర్లు కూడా ఈ ఛానళ్ల ద్వారా పెద్ద ఎత్తున డేటా చౌర్యానికి ఒడిగడుతున్నారని పేర్కొంది.
శాంతిభద్రతలకు పొంచివున్న ముప్పు
తీవ్రవాద సంస్థలు తమ హింసాత్మక కంటెంట్‌ను ప్రచారం చేయడానికి టెలిగ్రామ్ గ్రూపులను వాడుకుంటున్నాయని, దీనివల్ల తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెంది శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని కేంద్రం వివరించింది. పిల్లలపై జరిగే లైంగిక దాడుల దృశ్యాలను కూడా ఈ గ్రూప్‌లలో విపరీతంగా షేర్ చేస్తున్నట్లు ఆరోపించింది. సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలతో ఆర్థిక మోసాలు చేస్తున్నారని మండిపడింది. టెలిగ్రామ్ బాట్స్ ద్వారా యూజర్ల మొబైల్ నంబర్లు, ప్రభుత్వ గుర్తింపు కార్డుల వివరాలు, ఇతర సున్నితమైన వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నారని, పైరసీ సినిమాలు కూడా ఇందులో ప్రసారమవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.











