15 వేల మందితో 24 గంటల పహారా.
ఏడు సంవత్సరాల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒకరోజు పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీ చేరుకున్న జిన్‌పింగ్ సుమారు 24 గంటలు భారత్‌లో ఉండనున్నారు. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక భేటీ జరగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు సహా భారత్–చైనా సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది. జిన్‌పింగ్ వెంట ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులు, వ్యాపార ప్రతినిధులతో కూడిన భారీ బృందం వచ్చింది. ఆయన బస చేసే న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ చుట్టూ బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హోటల్ పరిసరాలను నో-ఫ్లై జోన్‌గా ప్రకటించి, యాంటీ టెర్రర్, బాంబ్ డిటెక్షన్ బృందాలను మోహరించారు. అణు, రేడియేషన్, బయోకెమికల్ ముప్పులను గుర్తించే ప్రత్యేక తనిఖీలు కూడా చేపట్టారు. హోటల్ చుట్టూ భూగర్భ పైపులైన్లు, ఇతర మౌలిక వసతులను సైతం పరిశీలించారు.
10 రోజుల ముందే చేరిన లిమోసిన్
జిన్‌పింగ్ పర్యటన భద్రతలో మరో ఆసక్తికర అంశం ఆయన అధికారిక వాహనం. చైనా సుమారు 10 రోజుల ముందుగానే కార్గో విమానం ద్వారా జిన్‌పింగ్ హోంగ్‌చీ స్టేట్ లిమోసిన్, బ్యాకప్ వాహనం, కమ్యూనికేషన్ పరికరాలను భారత్‌కు పంపినట్లు సమాచారం. విదేశీ భద్రతా బృందాలు తీసుకొచ్చే కొన్ని పరికరాలకు భారత నిబంధనలు వర్తిస్తాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలకు అనుమతి లేదని, కొన్ని ఆయుధాలు, భద్రతా పరికరాలను దేశంలోకి తీసుకురావడం నిషేధమని అధికారులు తెలిపారు. అలాంటి పరికరాలను కస్టమ్స్ వద్ద జమ చేయాల్సి ఉంటుంది. విదేశీ భద్రతా సంస్థలు వ్యక్తం చేసే ఆందోళనలను ఢిల్లీ పోలీసులు, ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేస్తూ విదేశాంగ శాఖ ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకుంటోంది. జిన్‌పింగ్ ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు భారత్ మండపం నుంచి విమానాశ్రయానికి బయలుదేరే అవకాశం ఉంది. ఆయన ప్రయాణించే బోయింగ్ 747-8 కూడా ప్రత్యేక భద్రతా వ్యవస్థలతో కూడిన అత్యాధునిక స్టేట్ ఎయిర్‌క్రాఫ్ట్ కావడం గమనార్హం.
15 వేల పోలీసులు.. 200 పారా మిలటరీ కంపెనీలు
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లింది. 15 వేల మందికి పైగా పోలీసులు, 200 కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. నగరంలోని వివిధ జోన్లు, సెక్టార్లలో పోలీసు బలగాలను విభజించి విధుల్లో పెట్టారు. సాంకేతిక నిఘా వ్యవస్థలను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. జిన్‌పింగ్ ప్రయాణించే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం–శాంతి పథ్ మార్గంలో 700కు పైగా సీసీటీవీ కెమెరాలు, ఐదు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సీసీటీవీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సుమారు 500 కెమెరాల ఫీడ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద కదలికల గుర్తింపు కోసం అదనపు కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకరోజు పర్యటన కోసం ఢిల్లీ మొత్తం ఇంత భారీ భద్రతా ఏర్పాట్లతో సిద్ధం కావడం జిన్‌పింగ్ పర్యటన ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది.
#XiJinping #XiJinpingIndiaVisit #XiJinpingDelhiVisit #BRICS #BRICSSummit2026 #BRICSSecurity #DelhiSecurity #XiJinpingSecurity #VVIPSecurity #DelhiPolice #15000Police #ParamilitaryForces #200ParamilitaryCompanies #TajPalaceHotel #DelhiPoliceSecurity #ModiXiMeeting #IndiaChinaRelations #ChinaIndia #DelhiNews #BRICSIndia











