కాంగ్రెస్ పార్టీలో ఎంతటి వారైనా సరే పార్టీ నిబంధనలకు లోబడి పనిచేయాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. నేతలు తమ వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దడం సరికాదని ఆయన హితవు పలికారు. నాయకులకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లేదా రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గాంధీ భవన్‌లో మాట్లాడిన ఆయన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
షబ్బీర్ అలీకి నోటీసులు
కామారెడ్డి నియోజకవర్గంలో నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. రాబోయే ఆదివారం కమిటీ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని మల్లు రవి తెలిపారు. మొదట షబ్బీర్ అలీ ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ చర్చించనుంది. వివాదంతో సంబంధం ఉన్న ఇరు పక్షాల వాదనలను పూర్తిగా విన్న తర్వాతే కమిటీ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
లొంగి ఉండాల్సిందేనన్న చంద్రశేఖర్ రెడ్డి
మరోవైపు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి సైతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసి తన వివరణ ఇచ్చారు. తనకు అందిన నోటీసులపై ఇప్పటికే లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. వారం రోజుల్లో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి పరిశీలన పూర్తి చేస్తామని మల్లు రవి హామీ ఇచ్చారని, కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు










