Home AP టీడీపీలో కొత్త నాయకత్వానికి శిక్షణ

టీడీపీలో కొత్త నాయకత్వానికి శిక్షణ

మంగళగిరిలో రెండు రోజుల కాంక్లేవ్‌.

తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కొత్త తరహాలో తీర్చిదిద్దేందుకు కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల్లో నాయకత్వ పటిమ పెంచేందుకు నేడు, రేపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ కాంక్లేవ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 10 సెషన్లుగా సాగే ఈ కార్యక్రమాన్ని శిక్షణతో పాటు ఇంటరాక్టివ్‌ విధానంలో నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కేడర్‌ సమన్వయం, రాజకీయ స్పందన, నాయకత్వ లక్షణాలపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పార్టీ నేతలు వారధిగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపైనా చర్చ జరగనుంది.

చంద్రబాబు, లోకేశ్‌ దిశానిర్దేశం

కాంక్లేవ్‌కు చంద్రబాబు, టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ హాజరై నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. తొలి రోజు నాయకత్వ అభివృద్ధి, సంస్థాగత నిర్మాణం, పార్టీ పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, స్వర్ణాంధ్ర విజన్‌, రాజకీయ ఆర్థిక సాధికారత, సంపూర్ణ సంక్షేమం వంటి అంశాలపై చర్చించనున్నారు. రెండో రోజు సుస్థిర అభివృద్ధి, ప్రజా సేవలు, సుపరిపాలన, రాజకీయ కమ్యూనికేషన్‌, ప్రజలకు ప్రభుత్వ సేవల చేరువ, ఎల్‌నినోపై అవగాహన, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలు పాల్గొనే ఈ కాంక్లేవ్‌ ద్వారా క్షేత్రస్థాయి టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ చూపించడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది.

 

#TDP #TDPLeadership #TDPLeadershipTraining #TDPConclave #Mangalagiri #ChandrababuNaidu #NaraLokesh #TeluguDesamParty #TDPCadre #TDPLeaders #PoliticalTraining #GrassrootsLeadership #TDPPolitics #APLocalElections #LocalBodyElections #SwarnandhraVision #GoodGovernance #AndhraPradeshPolitics