Home AP స్థానిక పోరుకు సై అంటున్న వైసీపీ కూటమి మోసాలే ప్రచారస్త్రాలు:భూమన

స్థానిక పోరుకు సై అంటున్న వైసీపీ కూటమి మోసాలే ప్రచారస్త్రాలు:భూమన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సంకేతాల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాండ్‌ అని, ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డులు అందిస్తామని భూమన తెలిపారు. ఓట్లు వేసిన ప్రజలను చంద్రబాబు వెన్నుపోట్లతో మోసం చేస్తున్నారని, అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. మీడియా, కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కార్యకర్తలందరూ క్రియాశీలంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమయ్యేలోగా పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేయాలని కోరారు. పరస్పర చర్చల ద్వారా పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

గెలుపే లక్ష్యంగా నేతల వ్యూహం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సంకేతాలు వస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ సర్వేలో తొలి స్థానంలో ఉందని, అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా మారిందని, 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేశారని విమర్శించారు. ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని, అనర్హులకు డీఎస్సీలో నియామకాలు కల్పించారని ఆరోపిస్తూ ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ పాలనలో కరువు నెలకొందని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మేనేజ్‌ చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. సమావేశంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

 

#YSRCP #YSRCPLocalElections #APLocalElections #LocalBodyElections #BhumanaKarunakarReddy #YSJagan #PeddireddyRamachandraReddy #RKRoja #ChittoorPolitics #TirupatiPolitics #YSRCPChittoor #YSRCPPolitics #AndhraPradeshPolitics #TDP #APPolitics #YSRCPStrategy #LocalElections #AndhraPradesh