Home AP స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం చేసే కుట్ర

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం చేసే కుట్ర

సర్కారుపై మండిపడ్డ కార్మిక సంఘాలు .
కూటమి ప్రభుత్వంపై చలసాని ఆగ్రహం.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో కలిసి కుట్ర చేస్తోందని కార్మిక నేతలు తీవ్రంగా ఆరోపించారు. ప్లాంట్‌కు ఉన్న కేంద్ర ప్రభుత్వ భద్రతను తొలగించడం ఈ ప్రయత్నాల్లో భాగమేనని మండిపడ్డారు. అక్టోబర్‌లో 456 ప్లాట్ల విక్రయానికి టెండర్లు పిలవనున్నారని పేర్కొంటూ.. భూములను అమ్మడం ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ను క్రమంగా ప్రైవేటు చేతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్లాంట్‌ ఆస్తులు, భూముల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళనలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేశారు.

సీఐఎస్ఎఫ్‌ భద్రతపై చలసాని ఫైర్‌

ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌కు సీఐఎస్ఎఫ్‌ భద్రత తొలగించడం దారుణమని అన్నారు. ప్లాంట్‌ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం స్టీల్‌ ప్లాంట్‌ను నాశనం చేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతున్నా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు సోషల్‌ మీడియాలో ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. సీఐఎస్ఎఫ్‌ తొలగింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, స్టీల్‌ ప్లాంట్‌ భూములను విక్రయించే హక్కు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

#VisakhapatnamSteelPlant #VizagSteelPlant #SteelPlantPrivatization #CISFSecurity #ChalasaniSrinivas #ChandrababuNaidu #PawanKalyan #RammohanNaidu #AndhraPradesh #TradeUnions #VizagNews