Home Telangana సర్‌తో ముస్లిం ఓట్ల తొలగింపునకు కుట్ర

సర్‌తో ముస్లిం ఓట్ల తొలగింపునకు కుట్ర

32

బెంగాల్, బిహార్‌లే ఇందుకు నిదర్శనం
తెలంగాణలో మొదలైందన్న అజారుద్దీన్

తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ, సర్‌ ప్రక్రియపై మంత్రి అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సవరణ నెపంతో ముస్లింల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో కూడా ఇదే పద్ధతిలో ముస్లింల ఓట్లను తొలగించి బీజేపీ రాజకీయ లబ్ధి పొందిందని విమర్శించారు. తెలంగాణలో సైతం అలాంటి కుట్రలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ ఓటు హక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరి ఓటును వారే కాపాడుకోవాలని సూచించారు.

భాషా పరిజ్ఞానం… ప్రతిపక్షాలపై విమర్శలు
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తనకు తెలుగు భాష రాయడం, చదవడం బాగా వచ్చని, చిన్నప్పుడు దీనిపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశానని చెప్పారు. అయితే తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే తనకు సులువైన భాషలో మాట్లాడుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతోందని కొనియాడారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తాం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తమ ప్రభుత్వం ప్రస్తుత విద్యా రంగానికి విడుదల చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పబ్లిసిటీకి దూరంగా ఉంటూ అనేకమంది పేద ప్రజల సమస్యలను పరిష్కరించానని తెలిపారు. తన వద్దకు వచ్చిన దాదాపు 200 మంది బాధితుల దరఖాస్తులను తక్షణమే పరిశీలించి, వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.