Home Telangana సీఈవోకే ‘సర్‌’ నోటీసులు! ఓటర్ల జాబితా సవరణలో ట్విస్ట్

సీఈవోకే ‘సర్‌’ నోటీసులు! ఓటర్ల జాబితా సవరణలో ట్విస్ట్

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి. సుదర్శన్ రెడ్డికి కూడా అధికారులు ‘సర్‌’ నోటీసులు జారీ చేశారు. 2002–2026 ఓటర్ల వివరాల్లో ఇంటిపేరు సరిపోలకపోవడంతో ‘నేమ్ అనమాలీస్‌’ కేటగిరీలో నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. నోటీసు అందుకున్న సుదర్శన్ రెడ్డి ఎన్నికల అధికారులకు అవసరమైన వివరాలు సమర్పించనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సర్ నోటీసుల వ్యవహారం ఓటర్లలో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే దాదాపు 93 లక్షల మందికి నోటీసులు అందినట్లు సమాచారం. ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి వివరాలతో సమర్పించినప్పటికీ నోటీసులు రావడంతో చాలామంది అయోమయానికి గురవుతున్నారు.

చిన్న తప్పులకే నోటీసులా?

నో మ్యాపింగ్, నేమ్ అనమాలీస్‌ కారణంగా హైదరాబాద్‌లో సుమారు 12.55 లక్షల మంది ఓటర్లు ఈ కేటగిరీల్లో ఉన్నట్లు సమాచారం. వీరందరికీ నోటీసులు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు దాదాపు లక్ష మందికి మాత్రమే అందినట్లు తెలుస్తోంది. ఓటరు పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు, చిరునామాలో చిన్నపాటి అక్షర దోషం ఉన్నా విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా SIR ప్రక్రియ గడువును మరో మూడు వారాలు పొడిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 15 వరకు నోటీసుల విచారణ కొనసాగనుంది. అక్టోబర్ 19న తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం గడువు పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. నోటీసుల విచారణను వేగవంతం చేయాలని సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశిస్తూ, ఆధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

#TelanganaSIR #SIRNotices #TelanganaVoterList #VoterListRevision #SudarshanReddy #TelanganaCEO #SIR2026 #VoterVerification #NameAnomalies #NoMapping #TelanganaPolitics #ElectionCommission #ElectoralRoll